
తనిఖీలు లేవు..!
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నాణ్యతను పట్టించుకోవాల్సిన అధికారులు తనిఖీలు చేయకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యం నడుస్తోంది. పదుల సంఖ్యలో అనుమతులు ఉండగా వందల సంఖ్యలో హోటల్, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. నాణ్యత పాటించకపోవడంతో ఏమైనా తినాలంటే ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
సిబ్బంది లేమితో సతమతం
జిల్లాలో హోటళ్లు, ఇతర దుకాణాలలో పర్యవేక్షణ కరువైంది. జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అండ్ ఫుడ్‌సెఫ్టీ డిగ్జినేటెడ్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. ఈ కార్యాలయంలో గెజిటెడ్ ఆఫీసర్, ఇద్దరు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఒక్క ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లేరు. కలెక్టరేట్‌లో కార్యాలయం ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. జిల్లా వైద్యారోగ్యశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రోగ్రాం అఽధికారికి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్‌గా ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
రెండేళ్లుగా ఒక్క కేసు కూడా లేదు..
జిల్లా ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతుంది. మూడు నాలుగేళ్ల క్రితం వరకు 10లోపు కేసులను నమోదు చేశారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో యథేచ్ఛగా కల్తీ చేసిన వస్తువులను విక్రయాలు చేపడుతూ, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తినుబండరాలు అమ్ముతున్నా పట్టించుకునే నా థుడే కరువయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమతి పదుల్లో..
జిల్లాలో సుమారు 500 వరకు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, 10 వరకు రెస్టారెంట్లు, 5 వరకు దాబాలు ఉన్నాయి. భూపాలపల్లి, కాటారం, గణపురం, టేకుమట్ల, చిట్యాల, కాళేశ్వరం వంటి ప్రాంతాలతో పాటు ప్రతీ మండల కేంద్రంలో హోటళ్లు, బేకరీలు, మెస్‌లు మొదలైనవి వందల సంఖ్యలో నడుస్తున్నాయి. జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా కేంద్రంలో కొన్ని తప్ప ఇతర ప్రాంతాల్లో నడిచే షాపులకు ఎటువంటి అనుమతులు పొందకుండా యఽథేచ్ఛగా నడిపిస్తున్నారు.
హోటల్ యజమానుల ఇష్టారాజ్యం
గెజిటెడ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఇన్‌చార్జ్‌లే..
పై ఫొటోలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్. ప్రధాన రహదారిపై నిబంధనలు పాటించకుండా హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణంలో తినుబండరాలు తయారు చేస్తున్నారు. ఈగలు వచ్చి తయారు చేసిన ఆహార పదార్థాలపై వాలుతున్నాయి. వాహనాల దుమ్ము ధూళి సైతం నూనెలో పడుతుంది. అపరిశుభ్ర వాతావరణమే కాకుండా రెండు మూడు రోజుల పాటు వినియోగించిన నూనెలోనే పదార్థాలను తయారు చేస్తున్నారు. నూనె పూర్తిగా నల్ల రంగుగా మారి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇక్కడ ఒక దగ్గరే కాదు.. ప్రతిచోటా ఇదే పరిస్థితి ఉంది.