
కేసుల దర్యాప్తును త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్ : దొంగతనాలు, ఆర్థిక నేరాల్లో ఫిర్యాదుదారుల కేసుల దర్యాప్తును త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, అనుమానితుల గురించి ఆరా తీస్తూ మానిటరింగ్ చేయాలని తెలిపారు. కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసులపై ఆరా తీసి ప్రతి కేసులో సాక్షులకు, ముద్దాయిలకు కోర్టు సమాన్లు అందించాలని ఆదేశించారు. నేరస్తులకు శిక్షపడే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలను పోలీస్ స్టేషన్ల వారిగా అడిగి తెలుసుకున్నారు. వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. మహిళలపై జరిగే నేరాల్లో వీలైనంత త్వరగా విచారణ చేసి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్‌కుమార్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, సీఐలు శ్రీనివాస్, రమేశ్, దయాకర్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ డాక్టర్ శబరీష్