చకచకా ధాన్యం రవాణా
ములుగు: మండు వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో 15 రోజుల నుంచి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికి అందిన పంటను కోతకోసి కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకునే సమయంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో రైతన్నలు రోడ్డు కెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం రైతులకు అండగా నిలవడానికి కంకణం కట్టుకుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్కతో మాట్లాడి రైతులకు, మిల్లర్లకు నష్టం జరగకుండా చూసేలా అదనపు కలెక్టర్(రెవెన్యూ) చీమలపా టి మహేందర్‌జీ, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, జిల్లా అధికారి షా ఫైజల్‌హుస్సేన్ తగిన చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు చేరేలా చూస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాల కారణంగా వడ్లు తడిసినా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోంది.
55,995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలోని 10 మండలాల్లో ఈ ఏడాది 56,100 ఎకరాల్లో వరిపంటను రైతులు సాగు చేశారు. సివిల్ సప్లయీస్ శాఖ తరఫున ఐకేపీ, జీసీసీ, పీఏసీఎస్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టి 64వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకుంది. అయితే కేంద్రాలు ప్రారంభమైన తర్వాత అధికారులకు, మిల్లర్లకు సఖ్యత కుదరకపోవడం, అదే సమయంలో అనూహ్యంగా అకాల వర్షాలు పడుతుండడంతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. చివరికి జిల్లాకు చెందిన మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడానికి ముందుకు రావడంతో కొలిక్కివచ్చింది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక అగమ్యగోచరంగా ఉన్న రైతన్నలను చూసి మంత్రి సీతక్క తగిన నిర్ణయం తీసుకున్నారు. తాలు, తేమ పేరుతో ఇబ్బంది పెట్టకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని మిల్లర్లను ఆదేశించారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి చకచక మిల్లులకు ధాన్యం చేరుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి వరకు 4,537 మంది రైతుల నుంచి 55,995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ మేరకు రూ.77.30 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారు. గతేడాది ఇదే సమయం వరకు 18,308 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు.
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు
అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం మేరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేశాం. మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ దివాకర పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఆదేశాలిస్తున్నారు. ఇప్పటి వరకు రైతులు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని మిల్లర్లను సముదాయిస్తూ ముందుకు సాగుతున్నాం. తేమ ఎక్కువగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మినహాయింపు చేస్తున్నాం. గతేడాది కంటే ఈసారి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం.
– రాంపతి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్
రెండేళ్లలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు
2023–24లో..
కొనుగోలు చేసిన ధాన్యం 18,308 మెట్రిక్ టన్నులు
రైతుల సంఖ్య 2,670
చెల్లింపులు రూ.40.33 కోట్లు
2024–25లో(గురువారం వరకు)
కొనుగోలు చేసిన ధాన్యం 55,995 మెట్రిక్ టన్నులు
రైతుల సంఖ్య 7,638
చెల్లింపులు రూ.77.30 కోట్లు
అకాల వర్షాలతో అప్రమత్తమైన అధికారులు
ఇప్పటికే 55,995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతుల ఖాతాల్లో
రూ.77.30 కోట్ల నగదు జమ
చకచకా ధాన్యం రవాణా


