ములుగు: క్షయవ్యాధి అంతమే లక్ష్యంగా ముందుకుసాగాలని జిల్లా వైద్యశాఖ అధికారి గోపాల్‌రావు వైద్య సిబ్బందికి సూచించారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఎదుట సోమవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్‌తో కలిసి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాల్‌రావు మాట్లాడుతూ క్షయవ్యాధిని ధ్వేషించాలే తప్పా రోగిని కాదన్నారు. సమగ్రమైన చికిత్సను తీసుకోవడం ద్వారా వ్యాధిని నిర్మూలించవచ్చని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు గ్రామసభలు, విలేజ్ న్యూట్రిషన్ కమిటీ, శానిటేషన్ కమిటీ, విలేజ్ జాస్ కమిటీ సమావేశాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. క్షయ వ్యాధికి గురైన వ్యక్తి సంవత్సరానికి 10మందికి వ్యాప్తి చేయగలడని తెలిపారు. జ్వరం, ఛాతినొప్పితో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడడం, బరువు తగ్గడం లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. నిర్ధారణ అయితే నిర్మూలనకు కోర్సును అందిస్తారని వివరించారు. క్షయ వ్యాధి బాధితులు ఆల్కహాల్, సిగరెట్ తాగడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి చంద్రకాంత్, వైద్యులు రాధిక, అనిల్, శ్రవణ్‌కుమార్, ఆర్‌ఎంఓ ప్రేమ్‌సింగ్, రాయినిగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసాద్, దుర్గారావు, పూర్ణసంపత్‌రావు, సురేష్‌బాబు, వెంకట్‌రెడ్డి, సమ్మయ్య, రాజు, రమేష్, చంద్రమౌళి, దేవేందర్, నిర్మలమేరి, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు