
రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగింది. హిందీ బెల్ట్‌లో ‘వార్ 2’ హవా కనిపించగా.. దక్షిణాదిలో రజనీ ‘కూలీ’ జోరు కనిపించింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన "వార్ 2" తెలుగు చిత్ర పరిశ్రమలో అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ, హిందీ బెల్ట్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు దగ్గరగా వార్2 కలెక్షన్స్ ఉన్నాయి. అయితే, వార్ 2 తెలుగు హక్కులను నిర్మాత నాగవంశీ సుమారు రూ. 80 కోట్ల వరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌లో అనుకున్నంతగా వార్2 కలెక్షన్స్ రాకపోవడంతో యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ కొంత రిటర్న్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్‌లో 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై 'వార్ 2' చిత్రాన్ని నిర్మాత నాగవంశీ విడుదల చేశారు. సుమారు రూ. 80 కోట్లకు కొనుగోలు చేసిన ఆయన సులువుగా రూ. రూ. 100 కోట్లకు పైగానే రాబడుతుందని అంచనా వేశారు. కానీ, ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.
బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ చాలా ప్రొఫెషనల్‌గానే ఢీల్ సెట్ చేసుకుంటుంది. ఈ సినిమాను కొనుగొలు చేసిన నాగవంశీకి కొంత ఉపశమనం అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం. నాగ వంశీతో పాటు అతని భాగస్వాములకు రూ. 22 కోట్లు తిరిగి ఇవ్వడానికి యష్ రాజ్ సంస్థ అంగీకరించినట్లు బాలీవుడ్ సమాచారం. నైజాంకు రూ. 10 కోట్లు, ఏపీకి రూ.7 కోట్లు, సీడెడ్‌కు రూ. 5 కోట్ల వరకు ఇచ్చేందుకు గ్రీన్ లభించిందట. అయితే, హిందీలో ఈ చిత్రానికి ఎలాంటి నష్టం లేదని తెలుస్తోంది.