
‘‘మిత్రమండలి’ మూవీ సీక్వెన్స్ బాగున్నాయి. ఫ్రెండ్స్‌తో కలిసి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది. ఇది నా ప్రామిస్’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జంటగా నటించిన సినిమా ‘మిత్ర మండలి’. ఎస్. విజయేందర్ దర్శకత్వంలో బన్నీ వాసు సమర్పణలో కల్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై, ‘తెల్లకోడి నల్లకోడి కళ్లముందే జోడి కూడి..’ పాటను విడుదల చేశారు. దర్శకులు వివేక్ ఆత్రేయ, కల్యాణ్, ఆదిత్యా హాసన్ , అనుదీప్ అతిథులుగా హాజరై, సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.
అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘మిత్రమండలి’ హిట్ కాక పోతే నా నెక్ట్స్ సినిమా చూడొద్దు. ‘కోర్ట్’ సినిమా టైమ్‌లో నాని అన్న చెప్పిందే కాపీచేసి, ‘మిత్రమండలి’ కోసం నేను చెబుతున్నాను’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిత్రమండలి’. ఈ దీ పావళికి రిలీజ్ అయ్యే నాలుగు సినిమాలూ హిట్ కావాలి. అందరితో పాటుగా మనం కూడా ఎదగాలని కోరుకునే వ్యక్తిని నేను. డబ్బులు పెట్టి పక్క సినిమాపై ట్రోలింగ్ చేసి ఎదుగుదాం అనుకుంటే మాత్రం... పైన దేవుడు ఉన్నాడు.. చూసే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు.
సినిమా బాగుంటే చూస్తారు. లేక పోతే నీదైనా, నాదైనా.. ఏ సినిమానైనా ఆడియన్స్ పక్కన పెడతారు. ఎంతమంది ఏం చేసినా నేను పరిగెడుతూనే ఉంటాను. అదే నా విజయం అని నమ్ముతాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. హిట్ కొడుతున్నాం అని ప్రోత్సహించిన కల్యాణ్ మంతెన, భాను, విజయేందర్, సోమరాజుగార్లకి థ్యాంక్స్’’ అన్నారు ఎస్. విజయేందర్.
‘‘మా సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. కానీ, కొంతమంది హేటర్స్ కూడా ఉన్నారు. వాళ్లు మా సినిమా ప్రీమియర్స్‌కి కూడా వస్తారని తెలుసు. వాళ్లకు మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ హాయిగా నవ్వించడం’’ అన్నారు నిర్మాత భాను ప్రతాప. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత విజయేందర్. ఈ వేడుకలో చిత్రయూనిట్ పాల్గొంది.