
హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ సినిమాకు ‘ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం’.. వంటి టైటిల్స్‌ను మేకర్స్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమాకు ‘అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్‌ను కూడా యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ తెరపైకి వచ్చింది. వెంకటేశ్ కెరీర్‌లో ఆల్రెడీ ‘అబ్బాయి గారు’ అనే సూపర్‌హిట్ ఫిల్మ్ ఉండటం, త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ ఎక్కువగా ‘అ, ఆ’ అక్షరాలతో మొదలయ్యే సంప్రదాయం ఉండటంతో ‘అబ్బాయిగారు 60 ప్లస్’ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
హిందీలో సంక్రాంతికి వస్తున్నాం?
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై, సూపర్ హిట్ అయింది. కాగా, ఈ సినిమాని
హిందీలో రీమేక్ చేయాలని ‘దిల్’ రాజు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.