
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కొత్త సినిమాలను ఖరారు చేయడంలో వెంకటేష్ జోరు పెంచారు. ఆయన నటించనున్న కొత్త సినిమాలపై స్పష్టత వచ్చింది. అమెరికాలో జరిగిన ‘నాట్స్–2025’ వేడుకల్లో తన తర్వాతి చిత్రాల గురించి వెంకటేశ్ హుషారుగా మాట్లాడారు. ‘‘త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాను.
మీనాతో కలిసి ఓ సినిమా చేస్తాను (దృశ్యం 3). ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలోనే మరో సినిమా ఉంది. ఈ చిత్రాలతో పాటు నా మిత్రుడు, తెలుగులో ఓ పెద్ద స్టార్ హీరోతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాను’’ అని తెలిపారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అని, అలాగే వెంకటేశ్ ప్రస్తావించిన భారీ ప్రాజెక్ట్ బాలకృష్ణతో ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.