జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్‌కు చెక్‌ పెడతారా? | Will Jr NTR put a check on Dragon rumors | Sakshi
Sakshi News home page

జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్‌కు చెక్‌ పెడతారా?

Apr 14 2026 11:43 PM | Updated on Apr 14 2026 11:43 PM

Will Jr NTR put a check on Dragon rumors

జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.

ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్‌ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్‌ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది.  

ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్‌డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.  

డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement