సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి 90రోజుల తర్వాత చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో సినిమా లవర్స్ తనకు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు. రవి అరెస్టైన రోజు నుంచే సోషల్‌మీడియాలో సపోర్ట్‌గా నిలిచారు. ఒక సమయంలో ఏకంగా పోలీసులపై మీమ్స్ చేశారు. దీంతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా కామెంట్ చేశారు. ఉచితంగా సినిమాలను అందిస్తున్నారనే కారణంతో అలాంటి వారిని ప్రేక్షకులు ప్రోత్సహించకూడదని ఆయన హితవు పలికారు.
సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై పోలీసులు 5 కేసులు పోలీసులు నమోదు చేశారు. ఆపై అతని పాస్‌పోర్ట్ కూడా సీజ్ చేశారు. రవి కారణంగా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సినీ పెద్దలు చెప్పుకొచ్చారు. దీంతో రవి ఇక విడుదల కాలేడని నెటిజన్లు క్లారిటీకి వచ్చారు. అయితే, రవికి తాజాగా బెయిల్ రావడానికి ప్రధాన కారణం పోలీసులే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అరెస్టయిన 90 రోజుల తర్వాత కూడా పోలీసులు చార్జిషీట్ వేయకపోవడం వల్లనే ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చింది.
రవిని కస్టడీలోకి తీసుకుని పలుమార్లు విచారణ చేసినప్పటికీ పూర్తి వివరాలు పోలీసులు రాబట్టలేకపోయారు. అరెస్టయిన తర్వాత 90రోజుల్లో చార్జిషీట్ వేయకపోతే నిందితుడు బెయిల్ కోసం వెళ్లొచ్చు. ఈ కారణంగానే రవికి బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు చార్జిషీట్ వేసేంత వరకు ప్రతిరోజు ఉదయం 11గంటల నుంచి సాయింత్రం 5గంటల లోపు ఎస్‌హెచ్‌ఓ వద్ద హాజరుకావాల్సిందేనని కోర్టు సూచించింది.
ఐబొమ్మ రవి జైల్లో ఉన్న సమయంలో కూడా ఎలాంటి ఢోకా లేకుండా మూవీ రూల్జ్ లాంటి పైరసీ వెబ్‌సైట్లు వాడుకలోనే ఉన్నాయి. రోజురోజుకి పుట్టుకొస్తున్న కొత్త వెబ్‌సైట్లతో పోలీసులకు అతిపెద్ద ఛాలెంజ్‌గా ఎదురైంది. సినిమా టికెట్ ధరలతో పాటు క్యాంటీన్‌లోని తినుబండారాల ఖర్చు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు కూడా థియేటర్‌కు వెళ్లలేకపోతున్నారు. దీంతో పైరసీలో సినిమా చూడటం తప్పని ప్రజలు ఫీల్ అవడం లేదని తెలిసిపోతుంది.


