తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల కేసుని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది. ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా విజయ్ పర్యటిస్తున్నారని, భద్రతా కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల కోర్టుకు రాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వివరించారు. మరోవైపు సంగీత కూడా కోర్టుకు రాలేదు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు విచారణని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)
గతంలోనే ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వాలని విజయ్‌కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కానీ సోమవారం.. ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసి విచారణని వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల అభ్యర్థన మేరకు ఈ విడాకుల కేసు విచారణని జూన్ 15వ తేదీకి వాయిదా వేశారు.
27 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న విజయ్-సంగీత.. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు ఇదివరకే తెలియజేశారు. విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకంపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్, భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన ఒప్పందానికి వచ్చారట. అయితే ఆర్థికపరమైన వివరాలు ఏవి కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పొందుపరచలేదు.
(ఇదీ చదవండి: నేను అడిగాను.. కానీ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదు: 'రాకా' గురించి ఆర్య)


