
చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించే ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా హీరోయిన్లకు కెరీర్ ప్రారంభంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఫస్ట్ చాన్స్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూసినవాళ్లు కూడా ఉన్నారు. వచ్చిన ఆ ఒక్క చాన్స్ని సరిగ్గా వాడుకున్న వాళ్లే ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా మారారు. అలా అందరిలాకే కెరీర్ ప్రారంభంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్(Vidya Balan). ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ టాలెంటెడ్ నటిపై మొదట్లో ‘ఐరెన్ లెగ్’ అనే ముద్ర వేసి రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారట. ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా విద్యా బాలనే చెప్పింది.
‘కెరీర్ ప్రారంభంలో నాకు మోహన్‌లాల్‌తో కలిసి ‘చక్రం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. షూటింగ్ ప్రారంభం అయిన కొన్నాళ్లకు అనూహ్యంగా అది ఆగిపోయింది. దానికి కారణం నేనే అని ప్రచారం జరిగింది. నాపై ‘ఐరెన్ లెగ్’ అనే ముద్ర వేసి ఘోరంగా విమర్శించారు. చక్రం సినిమా ఆగిపోయిందనే విషయం తెలియగానే రాత్రికి రాత్రే నేను ఒప్పుకున్న 9 ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు. అసలు ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కానే కాదు. ఆ మూవీ డైరెక్టర్, మోహన్‌లాల్ మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సగంలోనే ఆపేశారు.
అది నా కెరీర్పై చాలా ప్రభావం చూపింది. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. విశ్వాసంతో ముందుకు సాగాను. నాపై నాకు ఉన్న నమ్మకే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడేలా చేసింది. విశ్వాసంతో ముందుకుసాగితే ఏదోఒకరోజు కచ్చితంగా మనది అవుతుంది’ అని విద్యా చెప్పుకొచ్చింది. కాగా, 2005లో పరిణిత మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విద్యా.. ‘ది డర్టీ పిక్చర్’తో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో విద్యా లీడ్ రోల్ చేసింది. ఆమె నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. బాలీవుడ్‌లోనే కాదు దేశమంతటా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఇటీవల భూల్ భూలయ్య 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది.