
‘‘అవసరం ఉన్న వారి కోసం నిలబడే హీరో ‘రాబిన్‌హుడ్’. మా చిత్ర కథకి ఈ టైటిల్ యాప్ట్. ఈ మూవీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. నితిన్, నా కెరీర్‌లో ‘రాబిన్ హుడ్’ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది’’ అని డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ సినిమా తర్వాత చిరంజీవిగారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎగై్జట్ అయ్యారు. అయితే ఎక్కడో ఓ దగ్గర చిరంజీవిగారిని సంతృప్తి పరచలేకపోయాను. దీంతో మరో కథతో వస్తానని ఆయనకి చెప్పాను. కచ్చితంగా చిరంజీవిగారితో సినిమా చేస్తాను. నేను చెప్పిన ‘రాబిన్ హుడ్’ ఐడియా నితిన్‌కి నచ్చింది. ‘భీష్మ’ సినిమాతో నాకు, నితిన్‌కి మధ్య మంచి బంధం ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు’’ అని తెలిపారు.
వార్నర్ సరదాగా తీసుకున్నారు
ఇదిలా ఉంటే... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అబీప్రాయం ఏంటి? అని వెంకీని అడిగితే... ‘‘ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్‌గారి మాటలకు అర్థం ఏమిటనేది నేను వార్నర్‌గారికి చెప్పాను. ఆయన నవ్వి.. క్రికెట్‌లో కూడా ఇలాంటివి సహజమే అన్నారు. సీనియర్ ఆర్టిస్టుగా రాజేంద్ర ప్రసాద్‌గారు తన కోస్టార్స్‌ని చిన్న పిల్లల్లా అనుకుని, అలా సరదాగా అంటుంటారు. వార్నర్‌గారిని కూడా అలా సరదాగా అన్నారు’’ అని పేర్కొన్నారు.