
నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్ నిమ్మలపూడి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకు ‘సుందరకాండ’ తొలి చిత్రం. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ఈ రోజుల్లో ఓ అబ్బాయికి 30 ఏళ్ల వయసు దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయితీ అనుకుంటే, ఆ అబ్బాయి నాకు ఫలానా ప్రత్యేక లక్షణాలు ఉన్న అమ్మాయే కావాలని పట్టుబడితే ఏంటి? అన్నదే ఈ సినిమా కథ.
రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూపు ఉన్న లవ్ స్టోరీ ఇది. హీరో పాత్రకు ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి పాత్ర కోసం శ్రీదేవి విజయ్‌కుమార్‌గారిని, హీరో కంటే తక్కువ వయసున్న పాత్ర కోసం వృతి వాఘానిని తీసుకున్నాం. నాకు కామెడీ కథలంటే ఇష్టం. అయితే కామెడీ రాయడం కష్టం. ఈ సినిమాలో క్లీన్ కామెడీ ఉంటుంది. లక్కీగా ఈ సినిమాలో అందరూ కామెడీ బాగా చేయగలిగినవారే ఉన్నారు. బాగా చేశారు’’ అని అన్నారు.