కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్‌ | Why Tollywood Is Making More Devotional Movies Like Akhanda 2 | Sakshi
Sakshi News home page

కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్‌

Dec 13 2025 4:47 PM | Updated on Dec 13 2025 4:55 PM

tollywood making movies on devotional why is Akhanda 2

భారతదేశంలో దేవుడిపై భక్తి అనేది అత్యంత లోతైన, విస్తృతమైన ఆధ్యాత్మిక భావన. అందుకే సినిమాల రూపంలో చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. విజయం సాధించాయి.  ఈ క్రమంలో తాజాగా అఖండ 2 కూడా అదే పాయింట్‌ మీద వచ్చింది. బాలయ్య అభిమానులు కూడా భక్తి, సనాతన ధర్మం మీద బాలయ్య పోరాటం అంటూ ఎలివేషన్స్‌ ఇస్తున్నారు.  

దేవుడిని నిర్మలమైన మనస్సుతో ప్రార్థించడం, మోక్షం కోసం ఆరాధించడం భక్తి యొక్క మూలం. విశ్వాన్ని సృష్టించి నడిపే, శాసించే అజ్ఞాత శక్తే దైవం అని మన శాస్త్రాలు వివరణ ఇస్తున్నాయి. భగవంతుడే సర్వోన్నతుడని భక్తుడు భావించాలి. ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయకూడదు. కానీ ,ఇందులోకి మతం చొచ్చుకు రావడంతో సమాజంలో వైశ్యామ్యాలు ఏర్పడుతున్నాయి. భక్తి అంటే దైవంతో వ్యక్తిగత అనుబంధం, ప్రేమను చూపడం. మతం అంటే దైవాన్ని పూజించే పద్ధతులు, నమ్మకాలు, సంప్రదాయాల వ్యవస్థ అని తెలిసిందే. కానీ, నేటి దర్శకనిర్మాతలు డబ్బు కోసం ఈ రెండిటిని జోడించి సినిమాలుగా తీయడమే అసలు సమస్య వస్తుంది. భక్తి సినిమాలు పెరగడం వల్ల ప్రజల్లో మరింత మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

భక్తి సినిమాలకు భారీ డిమాండ్‌
భారత్‌లో భక్తి సినిమాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పురాణాలు, ఇతిహాసాలు, దేవతా కథల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అలాగే ప్రేక్షకులు వీటిని ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. భక్తి సినిమాలు కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి.  భక్తి సినిమాలు ప్రేక్షకుల ఆధ్యాత్మిక అనుబంధాన్ని తాకుతూ.. బాక్సాఫీస్ వద్ద కూడా బలమైన విజయాలు సాధిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పురాణ, ఇతిహాస ఆధారిత సినిమాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఈ జానర్‌కు మార్కెట్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

భక్తిని డబ్బుగా మలుచుకుంటున్న సినిమా ఇండస్ట్రీ
భక్తి సినిమా అంటేనే చాలా ప్రత్యేకం.. అందుకే సినిమా పరిశ్రమ టార్గెట్‌ భక్తి మార్గమే అయింది. పురాణ కథలను తమకు అనుగుణంగా మార్చడం లేదా తప్పుగా చూపించడం వివాదాలకు దారితీస్తుంది. ఇలాంటి వివాదంలో చాలా సినిమాలు చిక్కుకున్నాయి. భక్తి సినిమాలు ఎప్పటికీ ఆధ్యాత్మికతను, విశ్వాసాన్ని గౌరవించేలా ఉండాలి. అప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. మతసామరస్యం, కులవ్యవస్థ వ్యతిరేకత, ప్రజలకు ఆధ్యాత్మికత చేరువ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, దర్శకులు ముందుకు రావాలి.

సినిమా పేరుతో దందా
ఒకప్పుడు ప్రజల్లో భక్తిని నింపే చిత్రాలు వచ్చేవి.. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు, కన్నప్ప శ్రీ రామ రాజ్యం, దేవుళ్లు, షిరిడి సాయి వంటి సినిమాలకు ఎవరూ పేరు పెట్టరు కూడా.. అయితే, 1990 దశకం ముందు ఎక్కువగా భక్తి చిత్రాలే ప్రేక్షకులను మెప్పించాయి. అప్పట్లో వారు భక్తితో పరవశించారు. అయితే, ఇప్పడు భక్తి పేరుతో వచ్చే సినిమాలు వివాదాలకు తావిస్తున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాలను వక్రీకరించడమే కాకుండా వాటికి కాస్త కల్పితాలను జోడించి నిర్మిస్తున్నారు.

అఖండ భక్తి సినిమానేనా.. ఏం చెబుతుంది?
రీసెంట్‌గా మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రేక్షకులకు అందించాడు. తన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాలి. కానీ, పూర్తిగా భక్తితో నిండిన సినిమాను మనోళ్లు పెద్దగా ఆదరించలేదు. ప్రస్తుతం మన సినిమా  ట్రెండ్ సనాతన ధర్మం, దేశభక్తి, యాక్షన్ టచ్ ఇలా ఏదో ఒక పాయింట్‌ ఉంటే ప్రేక్షకులకు రీచ్‌ అవుతుంది. కానీ, అఖండలో  అన్నీ కలిపి కొట్టేశారు. బాలయ్య పాత్ర మొత్తం డివోషినల్‌గా ఉంటుంది. కానీ, మాస్‌ ఆడియన్స్‌ కోసం ఐటమ్‌ సాంగ్‌ను ఇందులో చేర్చారు. కేవలం విజిల్స్‌ కోసమే దేవుడి పేరును ఉపయోగించారు. దేవుళ్లను ఇలా ఎలివేషన్స్‌ కోసం దర్శకులు ఉపయోగించడం ఏంటి అనే సందేహాలు రావడం సహజం. 

అఖండ2లో బాలయ్య పాత్ర చాలా బలంగా ఉంటుంది. కానీ, ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేపించేందుకు హనుమాన్‌ను గ్రాఫిక్స్‌ చేసి సీన్‌ క్రియేట్‌ చేశారు. అక్కడ సీన్‌లో స్కోప్‌ లేకున్నా సరే హనుమాన్‌ను చేర్చడం విడ్డూరంగానే ఉంటుంది. అఖండలో శివుడి పాత్ర అదుర్స్‌.. తన భక్తురాలి కోసం భగవంతుడే దిగొస్తాడని చూపించిన తీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement