
కొప్పున్న అమ్మ ఏ కొప్పేసినా అందమే.. జడ ముడిచినా, జడ అల్లుకున్నా అందంగానే కనిపిస్తుంది. అయితే తను జడ అల్లుకోడమే పాపమైపోయింది అని చిరాకుపడుతోంది బాలీవుడ్ భామ ఉర్ఫీ జావెద్. ఆమె కోపానికి కారణం లేకపోలేదు! ఇటీవల ప్రముఖ నటి ప్రియాంక చోప్రా పొడవాటి జడతో దర్శనమిచ్చింది. జుట్టును వదులుగా వదిలేయకుండా కుదురుగా అల్లుకుని ఉంది. తాజాగా ఉర్ఫీ జావెద్ కూడా జుట్టు అల్లుకుని కనిపించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు నువ్వు ప్రియాంకను కాపీ కొట్టావంటూ విమర్శలకు దిగారు.
ఈ ట్రోలింగ్‌కు చెక్ పెడుతూ ఉర్ఫీ జావెద్ జడ అల్లుకున్న పాత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. 'ఇది నాలుగు నెలల క్రితం తీసిన ఫొటో. ఇప్పటికీ నేను ప్రియాంక చోప్రాను కాపీ కొట్టానంటారా? చెప్పండి.. నేను ఎప్పుడూ నా జుట్టును ఎలా ముడేసుకుంటానో అదే హెయిర్ స్టైల్ వేసుకున్నాను. కాకపోతే అప్పటికంటే ఇప్పుడు నా జుట్టు కాస్త పొడుగైందంతే.. అయినా జడ అల్లుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇలా జడ అల్లుకుంటే ఒకరిని కాపీ కొట్టారంటే ఈ ప్రపంచమే సిగ్గుపడాల్సి వస్తుంది' అని ఘాటు రిప్లై ఇచ్చింది.