మన దేశానికి వచ్చేస్తున్న యూనివర్సల్‌ స్టూడియోస్, ఆ ప్రాంతం ఇక సరికొత్త సినిమా క్యాపిటల్, ఎక్కడంటే? | Universal Studios is coming to our country and the area is now the new movie capital | Sakshi
Sakshi News home page

మన దేశానికి వచ్చేస్తున్న యూనివర్సల్‌ స్టూడియోస్, ఆ ప్రాంతం ఇక సరికొత్త సినిమా క్యాపిటల్, ఎక్కడంటే?

May 22 2025 9:20 PM | Updated on May 22 2025 9:20 PM

Universal Studios is coming to our country and the area is now the new movie capital

హాలీవుడ్‌ సినిమాలతో బాగా అనుబంధం ఉన్నవారికి యూనివర్సల్‌ స్టూడియోస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఎన్నో హాలీవుడ్‌ సినిమాలు రూపుదిద్దుకున్నది యూనివర్సల్‌ స్టూడియోలోనే. ప్రపంచ సినీరంగానికి యూనివర్సల్‌ స్టూడియో అనేది ఒక డ్రీమ్‌ మేకింగ్‌ ప్లేస్‌ అని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలనుకున్న ప్రతీ టెక్నీషియన్‌ కల యూనివర్సల్‌ స్టూడియో.  ఈ నేపధ్యంలో భారతీయ సినిమా రంగానికి సినీ అభిమానులకు చెప్పుకోదగ్గ శుభవార్త ఏమిటంటే, మన దగ్గర త్వరలో యూనివర్సల్‌ స్టూడియోస్‌ థీమ్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. 

అవును...నిజం...భారతదేశం త్వరలో యూనివర్సల్‌ స్టూడియోస్‌ థీమ్‌ పార్క్‌ను స్వాగతించబోతోంది. ఈ ప్రపంచ వినోద దిగ్గజం త్వరలో ప్రపంచ స్థాయి థీమ్‌పార్క్‌తో సహా భారతదేశంలోకి అడుగుపెట్టనుంది. త్వరలోనే సినీ రూపకర్తల కల సాకారం కానుంది.  భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో యూనివర్సల్‌ స్టూడియోస్‌ పార్క్‌ ఉన్న కొన్ని దేశాలలో ఒకటిగా అవతరించనుంది. ప్రస్తుతం ఈ థీమ్‌ పార్క్‌ యునైటెడ్‌ స్టేట్స్, జపాన్, సింగపూర్,  చైనా దేశాల్లో మాత్రమే ఉంది.

అందుతున్న సమాచారం  ప్రకారం, భారతదేశంలో యూనివర్సల్‌ స్టూడియోస్‌ థీమ్‌ పార్క్‌ త్వరలో హర్యానాలోని ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఢిల్లీ‌ నుంచి కొంచెం దూరంలో నెలకొల్పనున్నారు. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం, ఈ పార్క్‌ గురుగ్రామ్‌ రూపురేఖల్ని మార్చేయనున్న ప్రాజెక్ట్‌ కానుంది.  హర్యానా రాష్ట్ర పారిశ్రామిక  మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎస్‌ ఐఐడిసి) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి, ఇప్పటికే సైట్‌ చుట్టూ మౌలిక సదుపాయాల ప్రణాళికల అమలు కూడా ప్రారంభించింది. ఇది రాబోయే 3 మిలియన్‌ చదరపు అడుగుల మాల్‌ లోపల అభివృద్ధి చేయబడిన ఇండోర్‌ థీమ్‌ పార్క్‌ అవుతుంది. మీడియా నివేదికల ప్రకారం, వినోద ఉద్యానవనాన్ని నిర్మించడానికి భారతి ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ ఇక్కడ 300,000 చదరపు అడుగుల స్థలాన్ని  లీజుకు తీసుకుంటుందని తెలుస్తోంది.  

భారతదేశంలో ప్రారంభమవుతున్న ఈ అత్యంత భారీ  పార్క్‌లో ఒసాకా హాలీవుడ్‌లో ఉన్నట్లుగా థీమ్‌ , రైడ్‌లు, షోలు కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ ఆకర్షణలు ఉంటాయి. మన దేశానికి యూనివర్సల్‌ స్టూడియోస్‌ రాక ఉపాధి రంగానికి కూడా ఊతమిచ్చే శుభవార్త అనే చెప్పాలి. ఈ పార్క్‌ అనేక రకాల ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.  దీని చుట్టుపక్కల ప్రాంతంలో హోటళ్ళు, రవాణా సేవలు  షాపింగ్‌ కేంద్రాలు తదితర వాణిజ్య కార్యకలాపాలు ముమ్మరం అవుతాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం సరికొత్త సినిమా క్యాపిటల్‌గా అవతరించినా ఆశ్చర్యం లేదు.  గురుగ్రామ్‌లోని ఈ స్థలం అటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మెట్రో మార్గాలు ఇటు మరి కొన్ని ప్రధాన రహదారులకు సులభమైన కనెక్టివిటీని అందిస్తుంది. నిజానికి యూనివర్సల్‌ స్టూడియోస్‌ భారతదేశంలో తన తొలి అడుగు వేసేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఇదీ ఒక కారణమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement