
చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్‌కు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన తండ్రి విక్రమ్ నటనను చూసి ఎదిగిన వారసుడు. తొలి చిత్రం వర్మతోనే నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయితే ఆ చిత్రం సక్సెస్ కాకపోవడం, ఆ తరువాత తన తండ్రి విక్రమ్‌తో కలిసి నటించిన మహాన్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ధ్రువ్‌విక్రమ్ ఇప్పటివరకు విజయానికి దూరంగా ఉన్నారు. సరైన కథ, దర్శకుడి చేతిలో పడితే తన సత్తా చాటగలనని ఈ యువ నటుడు బైసన్ చిత్రంతో నిరూపించుకున్నారు.
మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ కథానాయకుడిగా నటించిన బైసన్ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్‌న్స్, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.

ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్‌ను గుర్తు చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో అక్టోబర్ 24న విడుదల కానుంది. దర్శకుడు మారీ సెల్వరాజ్ గతంలో తెరకెక్కించిన మామన్నన్, కర్ణన్, వాజై చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు బైసన్ మూవీ కూడా మంచి విజయం సాధించింది.