
కోలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్ వచ్చేసింది. తృప్తి రవీంద్ర (Trupti Ravindra) ప్రధాన పాత్రలో నటించిన శక్తి తిరుమగన్ (భద్రకాళి) చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది.. మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ బ్యూటీ ఇంజినీరింగ్ పట్టభద్రురాలు, అలాగే స్టేజీ ఆర్టిస్ట్ కూడా! ఐదేళ్లపాటు నాటకాల్లో నటించిన తృప్తి రవీంద్ర పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. డాన్స్, యోగ వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో తృప్తి తమిళ భాషను నేర్చుకోవడం విశేషం. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం అందించారు.
సంతోషంగా ఉంది
తాజాగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. థియేటర్ నాటకాల ద్వారా నటనలో శిక్షణ పొందినట్లు చెప్పింది. దర్శకుడు అరుణ్ ప్రభు, విజయ్ ఆంటోనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. శక్తి తిరుమగన్ మూవీ ద్వారా కథానాయక పరిచయం అవుతుండటం గొప్ప విషయంగా భావిస్తున్నానంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నట్లు తెలిపింది. ఇలాంటి అర్థవంతమైన కథాపాత్రల్లో, ఇతర భాషల్లోనూ నటించడానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చేసింది. అదేవిధంగా ప్రేక్షకులపై మంచి ప్రభావాన్ని చూపించే సినిమాలను అందించే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.