కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ కథతో తీసిన సినిమా 'త్రికాల'. శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రధారి. మణి తెల్లగూటి దర్శకుడు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలను తదితర అంశాలతో దీన్ని తీశారు. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)
కథేంటి?
శతాబ్దాల క్రితం కుమారి ఖండం అనే ప్రాంతంలో కొందరు ఋషులు.. శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన రహస్యాలను ఓ రహస్య ప్రదేశంలో దాచిపెడతారు. వాటిని రక్షించేందుకు ఓ ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులపై పోరాడుతూ అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు. ప్రస్తుతానికొస్తే శివ (మాస్టర్ మహేంద్రన్) కనిపించకుండా పోయిన తన ప్రేయసి నిధి (సాహితి) కోసం సిటీకి వస్తాడు. ఇతడి జీవితంలోకి వైతరణ్ వస్తాడు. నిజానికి ఇతడు పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ. ఇతడి ఆత్మ ఓ బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఆ ఇంట్లో చిక్కుకుపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
'త్రికాల' రొటీన్ హారర్ సినిమా కాదు. మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్ తదితర అంశాలతో తీశారు. పౌరాణిక రహస్యాలు, కర్మ సిద్ధాంతం, డార్క్ ఫాంటసీ లాంటివి బాగానే కుదిరాయి. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రలతో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పౌరాణికతని ఆధునిక ప్రపంచంతో మిక్స్ చేసి చూపించారు.
అలానే వైతరణ్ పాత్రలో అజయ్, శివగా మాస్టర్ మహేంద్రన్, సైకియాట్రిస్ట్‌గా శ్రద్ధా దాస్ పాత్రలకు తగ్గట్లు నటించారు. మిగిలిన పాత్రధారులు తమ వంతు న్యాయం చేశారు. దర్శకుడు మణి తెల్లగూటి కూడా మెప్పించాడు. సినిమాటోగ్రాఫర్ పవన్ తనదైన కెమెరా మ్యాజిక్ చేశారు. థ్రిల్లింగ్ మూడ్ తీసుకొచ్చారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ సినిమాకు సెట్ అయింది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించింది. మాయా అండం, అసుర శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలు, ప్రాచీన ప్రపంచాల డిజైన్ తదితర విజువల్స్ ఆకట్టుకున్నాయి.
(ఇదీ చదవండి: 'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


