'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Blast Zone Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

May 28 2026 2:09 PM | Updated on May 28 2026 3:53 PM

Blast Zone Movie Review And Rating In Telugu

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసింది. అర్జున్‌ సినిమా కావడంతో టాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
రాజారామన్ (అర్జున్ సర్జా) కరాటే మాస్టర్. ఆయన సతీమణి నీలవేణి(అభిరామి), కూతురు నీల(ప్రీతి ముకుందన్‌)తో పాటు కుటుంబ సభ్యులంతా మార్షన్‌ ఆర్ట్స్‌లో నిపుణులు. ఒకపక్క కరాటే శిక్షణ ఇస్తూనే మరోపక్క మెడికల్‌ షాపు రన్‌ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుంటారు.  తనతో దురుసుగా ప్రవర్తించే మగాళ్లను చితకబాదుతూ..  తల్లితో తింట్లు తింటుంది నీల.  కూతురుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నీలవేణి ప్లాన్‌ చేస్తుండగా.. అనుకోకుండా ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్‌తో శత్రుత్వం ఏర్పడుతుంది.  వారి వెనుక బడా వ్యాపారవేత్త వరుణ్‌ దయాల(జాన్ కొక్కెన్) ఉంటాడు.  ఓ ఇల్లీగల్‌ బిజినెస్‌ డీల్‌ కోసం అతను మంత్రికి లంచంగా ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లు  చేరాల్సిన చోటుకి చేరకుండా పరోక్షంగా రాజారామన్‌ ఫ్యామిలీ అడ్డుకుంటుంది. దీంతో వరుణ్‌ దయాల మనుషులు కూడా రాజా రామన్‌ ఫ్యామిలీని చంపేందుకు ప్లాన్‌ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి రాజారామన్‌ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? రూ. 1000 కోట్ల లంచం వెనుక ఉన్న రూ. 7000 కోట్ల ఇల్లీగల్‌ బిజినెస్‌ ఏంటి? ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న మార్షన్‌ ఆర్ట్స్‌ శిక్షణతో అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యాన్ని రాజా రామన్‌ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సమాజంలో అన్యాయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే సందేశం ఇచ్చిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి లేదు కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా చూస్తున్నంత పెద్దగా బోర్‌ కొట్టదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. అలాగే కథనం చాలా వరకు ఊహకందేలా సాగుతుంది. అయితే కొన్ని కథల విషయంలో తర్వాత ఏం జరుగుతుందనేది ముందే తెలిసినా.. దాన్ని తెరపై ఎలా ప్రజెంట్‌ చేస్తాడనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుడిలో కలుగుతుంది. తాను ఊహించినట్లుగానే ఆయా సన్నివేశాలు సాగితే.. కథతో మరింత కనెక్ట్‌ అవుతాడు. ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఊహించినట్లుగానే కథనం సాగినా..ఆసక్తి మాత్రం తగ్గదు. బోర్‌ కొడుతుందని ప్రేక్షకుడు ఫీలయ్యేలోపు ఓ భారీ యాక్షన్‌ సీన్‌తో పాటు ప్రతి పాత్రకు ఎలివేషన్‌ ఇచ్చి కథతో లీనమయ్యేలా చేశాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకున్నాడు.

సినిమా ప్రారంభంలో రాజారామన్‌ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు రాజారామన్‌ ఫ్యామిలీ స్టోరీని, మరోవైపు రౌడీ వ్యాపారవేత్త వరుణ్‌ దయాల్‌ రూ. 7000 కోట్ల బిజినెస్‌ డీల్‌ని చూపిస్తూ కథనం నడిపించి ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని పెంచేశాడు. ఈ రెండు కథలకు మధ్య సంబంధం ఉంటుందని ప్రేక్షకుడు ఊహించినా.. ఎలా ముడిపెడతాడనే ఆసక్తి మాత్రం ఫస్టాఫ్‌ అంతా కొనసాగుతుంది. 

ఫ్యామిలీ సీన్లు రొటీన్‌గానే ఉన్నా.. ప్రతీ ముకుందన్‌ చేసే యాక్షన్‌ సీన్స్‌ మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్‌కి ముందు ఇంట్లో అర్జున్‌, ప్రీతి ముకుందన్‌, అభిరామి చేసే యాక్షన్‌ సీన్‌ అదిరిపోతుంది. ఇంటర్వెల్‌ బ్లాస్ట్‌ బాగుంటుంది. ఇక ద్వితియార్థంలో అర్జున్‌ ఫ్యామిలీ.. రౌడీలను ఎలా ఎదుర్కొన్నాడనేదే ఉంటుంది. కథనం ఊహకందేలా సాగినా.. యాక్షన్‌ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. ముగింపు రొటీన్‌గానే ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
 చాలా రోజుల తర్వాత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా చేసిన యాక్షన్‌ సినిమా ఇది. రాజారామన్‌ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీశాడు. కొన్ని చోట్ల వింటేజ్‌ అర్జున్‌ని చూస్తారు. ఇక ఇన్నాళ్లు కేవలం గ్లామర్‌ పాత్రకే పరిమితం అయిన ప్రీతి ముకుందన్‌, అభిరామి.. ఇందులో యాక్షన్‌ సీన్స్‌ చేసి ఆశ్చర్యపరిచారు.ఇద్దరూ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని చేసిన హై-ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సులు సినిమాకు కొత్తదనం తెచ్చాయని చెప్పొచ్చు.  వరుణ్‌ దయాల్‌గా జాన్‌ కొక్కేన్‌, అబ్రహాంగా అర్జున్‌ చిదంబరం, కిరుబకరన్‌గా పవన్‌ కృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. రవి బస్రూర్‌ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement
 
Advertisement
Advertisement