ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా వారణాసి. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరూ మళ్లీ పాన్ వరల్డ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్
రామ్ చరణ్ కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి ఆయన రూపొందిస్తున్న కథ పాన్ వరల్డ్ స్థాయిలో యూనివర్సల్ అపీల్ కలిగిన జానర్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంకా హీరోకు నెరేషన్ ఇవ్వలేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే చరణ్‌ను కలసి కథ వినిపించనున్నారు. ప్రస్తుతం సుకుమార్, ఆయన టీమ్ ఈ పనిపైనే దృష్టి సారించారు. 
మహేష్ బాబు స్వంత బ్యానర్‌లో కొత్త ప్రాజెక్ట్
మహేష్ బాబు తన తదుపరి సినిమాను స్వంత బ్యానర్ జిఎంబిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొదట్లో డొమెస్టిక్ మార్కెట్‌కు సరిపడే సినిమా చేయాలని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఒక దర్శకుడు చెప్పిన లైన్ మహేష్‌ను ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆ కథ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. జిఎంబితో పాటు మరో బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందని సమాచారం.
ఇకపై పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి టాప్ హీరోలు ఇకపై కేవలం మన మార్కెట్‌కు సరిపడే కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. వారి దృష్టి మొత్తం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులపైనే ఉంది. టాలీవుడ్‌లో ఇకపై ప్రతి పెద్ద సినిమా గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందనుందనే చెప్పాలి.


