శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్‌గా..

Tollywood stars in Different characters In the new Movies - Sakshi

‘శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్‌గా కనిపించాలి.. ఓకేనా’ అంటే, మరో మాట మాట్లాడకుండా ‘ఓకే’ చెప్పేస్తారు కొందరు స్టార్స్‌. అలాంటి క్యారెక్టర్లను సవాల్‌గా తీసుకుని, తమలోని ఆర్టిస్ట్‌ని ప్రూవ్‌ చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తారు. కొందరు స్టార్స్‌ ఈ మధ్య అలా డిఫరెంట్‌గా కనిపించే మిషన్‌ మీద ఉన్నారు. కొంచెం ‘డిఫరెంట్‌’గా కనిపించే ఆ క్యారెక్టర్ల గురించి తెలుసుకుందాం.

ఎంత డబ్బైనా ఆఫర్‌ చేయండి? ఎంతటి దావత్‌నైనా ప్లాన్‌ చేయండి? సాయంత్రం ఆరు దాటితే అడుగు బయటపెట్టేదే లే అంటున్నారు వెంకటేశ్‌. ఇటు వెంకటేశ్‌ వెండితెర కో బ్రదర్‌ వరుణ్‌ తేజ్‌ కూడా గలాగలా మాట్లాడమంటే కాస్త గ్యాప్‌ ఇచ్చి గ్యాప్‌ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఈ కో బ్రదర్స్‌కు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది ‘ఎఫ్‌ 3’ చిత్రమే. ‘ఎఫ్‌ 2’ వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీ తర్వాత వెంకటేశ్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన తారాగణంగా అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 3’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

జీవితంలో డబ్బు ప్రధానమా లేక బంధాలు ముఖ్యమా? అనే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సాగే ఈ చిత్రంలో రే చీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తితో ఇబ్బందిపడే వ్యక్తి పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తారు. ఈ చిత్రంలో సునీల్, సోనాలీ చౌహాన్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘ఎఫ్‌ 3’ చిత్రం ఈ ఏడాది మే 27న విడుదల కానుంది. మరోవైపు మాటల్లేవ్‌ అంటున్నారు హీరో సూర్య. ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ బధిర (చెవుడు, మూగ) వ్యక్తి పాత్రలో సూర్య నటిస్తారనే ప్రచారం సాగుతోంది.

బాల దర్శకత్వంలో వచ్చిన ‘నంద’, ‘పితామగన్‌’ (తెలుగులో ‘శివపుత్రుడు’) తదితర చిత్రాల్లో నటించారు సూర్య. అలాగే బాల తెరకెక్కించిన ‘అవన్‌ ఇవన్‌’ (తెలుగులో వాడు–వీడు) చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. తాజాగా బాల దర్శకత్వంలో సూర్య చేయనున్న సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ఆరంభం కానుంది.

ఇంకోవైపు ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ ఓ చిత్రంలో మోనోఫోబియాతో బాధపడుతున్న రచయిత పాత్ర చేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రం ద్వారా సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒక ప్రమాదం ఓ రచయిత జీవితాన్ని ఎలా మార్చేసింది? అతను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని ఎలా అధిగమించాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇక అటు హిందీవైపు వెళితే చాలెంజింగ్‌ రోల్స్‌ చేస్తూ, దూసుకెళుతున్న తాప్సీ నటించిన తాజా చిత్రం ‘బ్లర్‌’. కంటి చూపుకి సంబంధించిన కథ ఇది అని టైటిలే చెప్పేస్తోంది. ఈ  చిత్రకథ నచ్చి లీడ్‌ రోల్‌ చేయడానికి అంగీకరించడంతో పాటు తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ‘జూలియాస్‌ ఐస్‌’ అనే స్పానిష్‌ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ ‘బ్లర్‌’లో క్రమ క్రమంగా కంటిచూపు మందగించే పాత్ర చేశారు తాప్సీ. చూపు మెరుగుపడడానికి శస్త్ర చికిత్స చేయించుకుని, కళ్లకు బ్యాండేజ్‌తో తాప్సీ కనిపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సీన్లలో నటించే ముందు నిజంగానే తాప్సీ కళ్లకు బ్యాండేజ్‌ వేయించుకుని, ఓ పన్నెండు గంటల పాటు అలానే తన పనులు చేసుకున్నారట.

క్యారెక్టర్‌లోకి పూర్తిగా ఒదిగిపోవాలనే ఇలా చేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్‌ బెహల్‌ ఈ చిత్రానికి దర్శకుడు. కొంచెం కొంచెంగా చూపు మందగించే పాత్రను తాప్సీ చేస్తే ‘బ్లైండ్‌’ చిత్రంలో సోనమ్‌ కపూర్‌ పూర్తిగా కళ్లు కనిపించని యువతిగా నటించారు. ఓ ప్రమాదంలో చూపు కోల్పోవడం, చేస్తున్న పోలీస్‌ జాబ్‌కు ఫుల్‌ స్టాప్‌ పడడం, ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. కొరియన్‌ సినిమా ‘బ్లైండ్‌’కి రీమేక్‌గా అదే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందింది. షోమే మఖీజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ గత ఏడాదే పూర్తయింది. త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం.

ఇక్కడ పేర్కొన్న స్టార్స్‌ మాత్రమే కాదు.. మరికొందరు కూడా కొంచెం ‘డిఫరెంట్‌’ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top