
టైటిల్: తురుమ్ ఖాన్‌లు
నటీనటులు:నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు
నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
దర్శకత్వం: ఎన్ శివ కల్యాణ్
సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్
సినిమాటోగ్రఫీ: అంబటి చరణ్
విడుదల తేది: సెప్టెంబర్ 8, 2023
కోవిడ్ తర్వాత సీనీ ప్రేక్షకుల అభిరుచి మారింది. కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్లకు వెళ్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో వరుసగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తాజాగా మరో చిన్న చిత్రం తురుమ్ ఖానులు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా తెలంగాణ, మహబూబ్ నగర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
తురుమ్ ఖాన్‌లు కథేంటంటే..
ఈ సినిమా కథంతా తుపాకుల గూడెం అనే గ్రామంలో జరుగుతుంది.ఆ గ్రామానికి చెందిన శంకర్ (నిమ్మల శ్రీరామ్)యూత్ లీడర్. కరోనా సమయంలో మరదలు లలిత(ఐశ్వర్య ఉల్లింగాల)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఊర్లో లాక్‌డౌన్ విధించడంతో పెళ్లి ఆగిపోతుంది. అయితే తన పెళ్లి ఆగడానికి కారణం విరాజ్ బ్రహ్మా(దేవరాజ్ పాలమూర్). లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకుంటారని పోలీసుకు తనే సమాచారం ఇస్తాడు. దీంతో బ్రహ్మాపై పగ పెంచుకుంటాడు శంకర్. మరోవైపు బ్రహ్మకు ఏమో 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, కావాల్సినంత డబ్బున్నా పెళ్లి కావట్లేదని అందరూ హేళన చేస్తుంటాడు.
ఇక లాక్‌డౌన్‌లో ఊరికి వచ్చిన బ్రహ్మా.. భర్త మరణించి, ఇద్దరు పిల్లలు ఉన్న భారతి(సీతా మహాలక్ష్మీ)తో ఎఫైర్ పెట్టుకోవాలనుకుంటాడు. మరోవైపు శంకర్ అనుచరుడు, కాలేజీ స్టూడెంట్ విష్ణు(అవినాష్ చౌదరి) పక్క ఊరికి చెందిన క్లాస్‌మేట్ పద్మతో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరమవుతారు. ఆమెను కలిసేందుకు విష్ణు ప్రయత్నిస్తుంటాడు. విష్ణు-పద్మలు విడిపోవాడానికి కారణం ఏంటి? శంకర్ పెళ్లిని బ్రహ్మా ఎందుకు ఆపాడు? బ్రహ్మాం, భారతీల ఎఫైర్ ఎక్కడకు దారి తీసింది? శంకర్, విష్ణు కలిసి బ్రహ్మాను ఏం చేశారు? చివరకు ఈ ముగ్గురి ప్రేమ కథలకు ఎలాంటి ముగింపు పడింది అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
తెలంగాణ యాస,భాష నేపథ్యంలో విలేజ్ నేటివిటితో వినోద భరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఎన్ శివ కల్యాణ్. హాస్యంతో పాటు మధ్య తరగతి కుటుంబాలు, పేదరికంతో బాధపడే రైతుల ఇబ్బందులను టచ్ చేస్తూ కథను అల్లుకున్నాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ..దాన్ని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది.
సినిమా మొత్తం సరదాగా సాగుతుంది కానీ..కొన్ని చోట్ల సీన్స్‌కి మధ్య లింక్ ఉండదు. సినిమా ప్రారంభమైన చాలా సేపటి కానీ ముగ్గురు హీరోలు ఒక చోటికి రారు. అసలు కథ ఏంటనేది అర్థం చేసుకోవాడానికి సమయం పడుతుంది. ముగ్గురి హీరోల క్యారెక్టర్లు ఇంట్రడక్షన్ తర్వాత కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో శంకర్, బ్రహ్మం ఇద్దరు టామ్ అండ్ జెర్రిలా ఎత్తులు, పై ఎత్తులు వేసే సీన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఫస్టాఫ్ సరదాగా గడిపోతుంది. ఇక సెండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. కొన్ని చోట్ల కథ మరింత సాగదీసినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు కథ ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో లోపాలు చాలా ఉన్నాయి కానీ.. కొత్త నటీనటులతో, పరిమిత బడ్జెట్‌తో సినిమాను ఉన్నతంగా తీర్చి దిద్దారు.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటీనటులంతా కొత్తవాళ్లే.అయినప్పటికీ చక్కగా నటించారు. శంకర్ పాత్ర చేసిన శ్రీరామ్ నిమ్మల చాలా మెచ్చూడ్ గా నటించారు. అలాగే జబర్దస్థ్ ఐశర్య తన అందం, అభినయంతో కట్టిపడేసింది. బ్రహ్మం పాత్రలో దేవరాజ్ పాలమూర్ పండించే కామెడీ సినిమాకు ప్లస్ అయింది.విష్ణుగా అవినాశ్ చౌదరి బాగా చేశారు, పద్మ పాత్రలో పులి సీత ఉన్నంతలో బాగా చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే..సినిమాకు ముఖ్యమైన బలం నేపధ్య సంగీతం అని చెప్పొచ్చు. మంగ్లీ ఆలపించిన పాట బాగుంటుంది. సినిమాటోగ్రాఫర్ అంబటి చరణ్ పల్లే నేపథ్యంలో సాగే కథను ఏ విధంగా చూపించాలో అదేవిధంగా చూపించి తన పనితనాన్ని కనబరిచాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.