
బుర్జ్ ఖలీఫా.. ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. దుబాయ్లోని ఆకాశసౌధం ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది. దుబాయ్ ట్రిప్ వెళ్లినవారు అక్కడ తప్పకుండా ఫోటోలు తీసుకోకుండా ఉండలేరు. అంతలా పర్యాటకంగా బుర్జ్ ఖలీఫా ఫేమస్ అయింది. అయితే ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే అనుకుంటే పొరపాటే. అంత ఎత్తైన శిఖరంలా కనిపించే ఈ ఆకాశం సౌధంలో నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. ఈ లగ్జరీ లైఫ్ స్టైల్‌కు చిరునామాగా మారిన ఈ బుర్జ్ ఖలీఫాలో అపార్ట్‌మెంట్ కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.
ఈ ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనంలో నివసించాలని ఎవరు కోరుకోరు. ఎన్ని కోట్లైనా సరే పెట్టేందుకు బడా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు క్యూ కడతారు. అలా ఈ ఆకాశ సౌధంలో మన సినీతారలు సైతం అపార్ట్‌మెంట్స్ కొనేశారు. ఇందులో బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఖరీదైన ఫ్లాట్లను తమ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.
బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి ఈ ఫ్లాట్ బహుమతిగా లభించింది. ఆమె భర్త, నటుడు రాజ్ కుంద్రా వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో లగ్జరీ ఫ్లాట్ను తన సతీమణికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమె విలాసవంతమైన నివాసం 19వ అంతస్తులో ఉంది. దీని విలువ దాదాపు రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
మోహన్ లాల్ స్వర్గధామం..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం బుర్జ్ ఖలీఫాలో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. ఆయన 29వ అంతస్తులో లగ్జరీ ఫ్లాట్ను కొన్నారు. దాదాపు 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఆధునాతన సౌకర్యాలు ఉన్నాయి. దీని విలువ దాదాపు రూ. 3.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ ఫ్లాట్‌ను మోహన్ లాల్ తన భార్య సుచిత్ర మోహన్‌లాల్ పేరు మీద రిజిస్టర్ చేశారు. వీరితో పాటు కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ వి నీరియపరంబిల్‌కు ఈ భవనంలో దాదాపు 22 ఫ్లాట్స్ కొనుగోలు చేశారట. అందువల్లే ఆయనను బుర్జ్ ఖలీఫా రాజు అని ముద్దుగా పిలుస్తారట.