Telugu Film Chamber Sets New Guidelines For Film Industry - Sakshi
Sakshi News home page

తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు

Published Sat, Sep 3 2022 6:26 AM

Telugu Film Chamber sets new guidelines for film industry - Sakshi

కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ–తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌) ఇటీవల నాలుగు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లు నిలిపివేసి, సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సెస్టెంబర్‌ 1 నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో నిర్మాత ‘దిల్‌’ రాజు పేర్కొన్నారు. షూటింగ్‌లు కూడా ఆరంభం అయ్యాయి.

తాజాగా పారితోషికం, ఓటీటీ, థియేట్రికల్‌ అండ్‌ ఎగ్జిబిషన్, ఫెడరేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ, టీఎఫ్‌సీసీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వస్తాయన్నట్లుగా టీఎఫ్‌సీపీ పేర్కొంది. కాగా ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపాకే ఈ కొత్త మార్గదర్శకాలను నిర్ణయించినట్లుగా టీఎఫ్‌సీసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా....

ప్రొడక్షన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌
► నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు.
► నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బంది వేతనాలు చెల్లించుకోవాలి. అలాగే స్థానిక రవాణా, బస, స్పెషల్‌ ఫుడ్‌ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి.
► సినిమా షూటింగ్‌ ప్రారంభించడా నికి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి.  
► కాల్షీట్స్‌ టైమింగ్, సెట్స్‌లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.
 
ఓటీటీ :
► ఓ సినిమా ఏ టీవీ చానెల్‌లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది? అనే అంశాలను టైటిల్స్‌లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్‌లో కానీ బహిర్గతం చేయకూడదు.
► థియేటర్స్‌లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావాలి.
 
థియేట్రికల్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌

► వీపీఎఫ్‌ (వర్చ్యువల్‌ ప్రింట్‌ ఫీ)కి సంబంధించిన చార్జీల విషయమై డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో నేడు జరగాల్సిన సమావేశం 6కి వాయిదా పడింది. 
► తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు ఎంత పర్సంటేజ్‌ ఇస్తున్నారో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే ఇస్తారు.
 
సినీ కార్మికుల సంఘం:
► కార్మికులకు సంబంధించిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయి. రేట్‌ కార్డ్స్‌ ఫైనలైజ్‌ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది.
ప్రొడ్యూసర్స్‌ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని భోగట్టా. కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని సమాచారం. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది పారితోషికం, సొంత రవాణా ఖర్చులు వంటివాటిపై ‘మా’ సుముఖత వ్యక్తపరిచిందట. కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ త్వరలో అధికారికంగా పంపనుందని సమాచారం.

► కొత్త మార్గదర్శకాల్లో రోజువారీ వేతనాల గురించిన అంశం ఒకటి. మామూలుగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో పెద్ద రేంజ్‌ ఉన్నవారు రోజువారీ వేతనాలు తీసుకుంటారు. అయితే ఇకపై వారికి కూడా సినిమాకి ఇంత అని పారితోషికం నిర్ణయించాలనుకుంటున్నారు. మరి.. రోజువారీ వేతనాలు తీసుకునేది ఎవరూ అంటే.. అట్మాస్ఫియర్‌ కోసం సీన్లో నిలబడేవాళ్లు, అటూ ఇటూ కదులుతూ కనిపించేవాళ్లు, డైలాగ్స్‌ చెప్పే జూనియర్‌ ఆర్టిస్టులు .. ఇలా చిన్న స్థాయి కళాకారులు రోజువారీ వేతనాల కిందకు వస్తారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement