ఐపీఎల్ ఎఫెక్ట్? టాలీవుడ్ ‍తప్పు చేస్తోందా? | Is Telugu Cinema Affected By Ipl Or Own Mistakes | Sakshi
Sakshi News home page

Tollywood IPL: వేసవిని వాడుకోలేకపోయిన టాలీవుడ్.. తప్పెవరిది?

May 11 2026 4:46 PM | Updated on May 11 2026 5:05 PM

Tollywood

AI Image

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అవసరమైతే తప్పితే జనాలు కూడా బయటకు రావట్లేదు. మరోవైపు ఐపీఎల్ మ్యాచుల వల్ల రోజూ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతోంది. కొన్ని మ్యాచులైతే థ్రిల్లర్ సినిమాలకు మించి ఉంటున్నాయి. ఇంత జరుగుతున్నా టాలీవుడ్‌లో చలనం లేదు. చెప్పాలంటే ఈ వేసవిని వాడుకునే సరైన మూవ ఒక్కటి రాలేదు. ఇంతకీ అసలేం జరుగుతోంది? టాలీవుడ్‌కి కూడా వేసవి సెలవులు ఇచ్చేయాలా?

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)

ఐపీఎల్ వల్ల టాలీవుడ్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందా? అంటే అవును కానీ పూర్తిస్థాయిలో మాత్రం కాదు. ఎందుకంటే సినిమాలు బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారు. లేదంటే స్టార్ హీరోల చిత్రాలు రిలీజైనా సరే కాస్తోకూస్తో సందడి కనిపించే అవకాశముంది. ఈసారి వేసవిలో అలాంటి అద్భుతాలేం జరగలేదు. ఇప్పటికే వేసవిలో రెండు నెలలు గడిచిపోయాయి. మార్చిలో వచ్చిన పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' హిట్ అయ్యుంటే బాక్సాఫీస్ కాస్తయినా కళకళలాడేది. కానీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇది తప్పితే మరో పెద్ద హీరో మూవీ ఈసారి వేసవిలో థియేటర్లలోకి రాలేదు.

అలా అని బాక్సాఫీస్ ఖాళీగా ఉందా అంటే ఏం లేదు. ప్రతివారం ఒకటో రెండో తెలుగు మిడ్ రేంజ్ లేదా చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిలో యావరేజ్ కాదుకదా నామమాత్ర కంటెంట్ కూడా ఉండట్లేదు. దీంతో వచ్చిన మూవీస్ వచ్చినట్లే డిజాస్టర్స్ అవుతున్నాయి. గతవారమే తీసుకుంటే మూడు తెలుగు సినిమాలు వస్తే వాటిలో ఒక్కటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

తెలుగు దర్శకులు వైవిధ్యంగా కాకుండా అదే రొట్టకొట్టుడు రొటీన్ కాన్సెప్ట్ సినిమాలు తీస్తూ తప్పులు చేస్తున్నారు. దీనికి తోడు ఐపీఎల్ ఉండటం పెద్ద మైనస్ అయింది. ఈ వారం కూడా సూర్య హీరోగా నటించిన 'వీరభద్రుడు' అనే డబ్బింగ్ బొమ్మ తప్పితే మరో చెప్పుకోదగ్గ మూవీ లేదు. సూర్య గత రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. ట్రైలర్ చూస్తే ఫక్తు కమర్షియల్ ఫార్మాట్‌లోనే ఉంది. సినిమా కూడా అలానే ఉండే అవకాశముంది. మరి ఇది ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?

ఇదంతా చూస్తుంటే ఈ ఏడాది వేసవిని టాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. పెద్ద మూవీస్ రాలేదు. వచ్చిన మిడ్ రేంజ్ చిత్రాలు ఆడలేదు. చిన్న సినిమాల వైపు జనాలు చూడలేదు. అలా ఈ వేసవి నీరు గారిపోయింది. ఇక వేసవి చివరలో అంటే జూన్ 4న 'పెద్ది' వస్తోంది. ప్రస్తుతానికైతే బాక్సాఫీస్ ఆశలన్నీ దీనిపైనే ఉన్నాయి. ఒకవేళ ఇది హిట్ అయితే రెండు వారాలైనా థియేటర్లు కళకళలాడుతాయి. లేదంటే అంతే సంగతులు. ఈ మొత్తం వ్యవహారంలో ఐపీఎల్ లాంటి వాటికంటే తెలుగు హీరోలు, దర్శకనిర్మాతల తప్పే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇలా వేసవిని వదిలేయడం బాక్సాఫీస్‌కి ఏ మాత్రం మంచిది కాదు.

(ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా)

Advertisement
 
Advertisement
Advertisement