Tees Maar Khan Movie Review: ‘తీస్‌మార్‌ ఖాన్‌’ మూవీ రివ్యూ

Tees maar khan Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : తీస్‌మార్‌ ఖాన్‌
నటీనటులు : ఆది సాయికుమార్, పాయల్‌ రాజ్‌పుత్‌, సునీల్, పూర్ణ తదితరులు
నిర్మాణ సంస్థ :విజన్ సినిమాస్ బ్యానర్ 
నిర్మాత:  నాగం తిరుపతి రెడ్డి
దర్శకత్వం: కళ్యాణ్ జి గోగణ
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ:బాల్ రెడ్డి
ఎడిటర్‌: మణికాంత్
విడుదల తేది: ఆగస్ట్‌ 19, 2022

‘ప్రేమ కావాలి’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్‌. తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. ‘లవ్లీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ‘తీస్‌మార్‌ఖాన్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్‌ 19) విడుదలైన ‘తీస్‌మార్‌ ఖాన్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.


కథేంటంటే..
తీస్‌మార్‌ ఖాన్‌(ఆది సాయికుమార్‌) ఓ అనాధ. తనకు ఒక్కపూట అన్నం పెట్టిందని మరో అనాధ అమ్మాయి వసూధ అలియాస్‌ వసు(పూర్ణ)ని అమ్మలా చూసుకుంటాడు. వీరిని ఓ పోలీసు కానిస్టేబుల్‌ దత్తత తీసుకొని పెంచుతాడు. అతను చనిపోయిన తర్వాత వసు భర్త చక్రి(సునీల్‌), తీస్‌మార్‌ ఖాన్‌ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. చిన్న చిన్న సెటిల్‌మెంట్స్‌ చేస్తూ జిమ్‌ సెంటర్‌ నడుపుకుంటున్న తీస్‌మార్‌ ఖాన్‌ జీవితంలోకి అనుకోకుండా జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తాడు.

జీజా రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌. అతని అరాచకాలను ఆడ్డుకునేందుకు నేరుగా హోంమంత్రి శ్రీరంగ రాజన్‌(శ్రీకాంత్‌ అయ్యంగార్‌)నే రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వసు హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు? జీజాకు ఈ హత్యతో ఏదైనా సంబంధం ఉందా? హోమంత్రి రంగ రాజన్‌కు తీస్‌మార్‌ ఖాన్‌ మధ్య ఉన్న అనుబంధం ఏంటి? తల్లిలా భావించే వసు మరణం తర్వాత తీస్‌మార్‌  ఖాన్‌కు హోంమంత్రి ఎలాంటి సహాయం చేశాడు. అవారాగా తిరిగే తీస్‌మార్‌ ఖాన్‌ ఎస్సై ఎలా అయ్యాడు? తీస్‌మార్‌ ఖాన్‌పై ముంబై మాఫీయా డాన్‌ తల్వార్‌(కబీర్‌ ఖాన్‌) ఎందుకు పగ పెంచుకున్నాడు? చివరకు వసుని హత్య చేసిన వారిని తీస్‌మార్‌ ఖాన్‌ ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
పోలీసు కథా నేపథ్యంలో యాక్షన్‌, లవ్‌, థ్రిల్లర్‌, ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రమిది. కొత్త కొత్త ట్విస్ట్‌లతో దర్శకుడు కథను బాగా రాసుకున్నప్పటికీ..తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడపడ్డాడు. హీరో ఎలివేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. తీస్‌మార్‌ ఖాన్‌, వసు బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలతో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే బాల్యం ఎపిసోడ్‌ కాస్త సాగదీశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. తీస్‌మార్‌ ఖాన్‌, అనగ కలిసిన తర్వాత సినిమాలో వేగం పుంజుకుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటి సీన్స్‌, లవ్‌ ట్రాక్‌ సరదాగా సాగుతుంది.

వసు మృతి... కథను మలుపు తిప్పుతుంది.  ఇంటర్వెల్‌ ముందు తీస్‌మార్‌ ఖాన్‌  ఎస్సైగా ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తాయి. మొదట్లో కాస్త సాగదీసినట్లు అనిపించినా.. జీజా మరణం తర్వాత కథలో మరింత వేగం పెరుగుతుంది. అయితే కథలో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. కథ, కథనంలో మరింత జాగ్రత్త పడితే ‘తీస్‌మార్‌ ఖాన్‌’ ఫలితం మరోలా ఉండేది. కమర్షియల్‌, థ్రిల్లర్‌ సినిమాను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
తీస్‌మార్‌ ఖాన్‌ పాత్రలో ఆది సాయికుమార్‌ ఒదిగిపోయాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ మూడు  పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూ యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. అనగ పాత్రకు రాజ్‌పుత్‌ పాయల్‌ న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించిది.  పాయల్ రాజ్‌పుత్‌తో వచ్చే  రొమాంటిక్ సన్నివేశాలు గుర్తిండిపోతాయి. ఇక పూర్ణ తన పాత్రకు న్యాయం చేసింది. చక్రిగా సునీల్‌ మెప్పించాడు. ఆయన పాత్రలోని వేరియషన్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌కు గురి చేస్తుంది. ఇక ఈ చిత్ర నిర్మాత నాగం తిరుపతి రెడ్డి కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. హోమంత్రిగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, విలన్స్‌గా కబీర్‌ సింగ్‌, అనూప్‌ సింగ్‌ తమ తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. 

ఒక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు సాయి కార్తిక్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. రొమాంటిక్‌ సాంగ్‌ తెరపై మరింత రొమాంటిగ్‌ ఉంటుంది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌  మణికాంత్ తన కత్తెరకు ఇంకాస్తా పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top