పాన్‌ ఇండియా మూవీ.. భయపడిపోతున్న హీరోయిన్లు! | Star Heroines Fear About Pan India Films | Sakshi
Sakshi News home page

పాన్ ఇండియా.. పాత్ర చిన్నదే, భయపడిపోతున్న హీరోయిన్లు!

Jun 11 2026 3:08 PM | Updated on Jun 11 2026 3:42 PM

Star Heroines Fear About Pan India Films

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమా అంతా ‘పాన్ ఇండియా’ మంత్రం జపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్, భారీ క్యాస్టింగ్, కళ్ళు చెదిరే విజువల్స్‌తో ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ పాన్ ఇండియా జోరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మాత్రం ఒక కొత్త భయాన్ని పుట్టిస్తోంది. సినిమా స్కేల్ ఎంత పెద్దదైనా, అందులో తమ పాత్రల నిడివి చాలా తక్కువగా ఉండడం, ప్రాధాన్యత లోపించడం, పైగా ఆ చిన్న పాత్రల వల్ల అనవసర వివాదాలు చుట్టుముట్టడంతో... ఇప్పుడు పాన్ ఇండియా ఆఫర్ వస్తేనే హీరోయిన్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా సినిమా పెద్ది ఇటీవల ప్రేక్షకుల ముందుకురాగా, అందులో జాన్వీ కపూర్‌ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెరపై ఆమెను చూపించిన తీరుపై సినీ తారలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి, ఆ సీన్లను తొలగించాడు. అయినా కూడా ఈ వివాదం సాగుతూనే ఉంది.

జాన్వీ పాత్రపై ఇలా విమర్శలు రావడం రెండోసారి. అంతకు ముందు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘దేవర’లోనూ ఆమె పాత్ర నిడివి తక్కువే ఉంది. అంతేకాదు నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ సమయంలో అలియా భట్‌ పాత్రపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. సినిమా అనౌన్స్ చేసినప్పుడు అలియా రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం కావడంతో అలియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరకు ఈ పాత్ర నిడివి విషయంలో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే నడిచింది.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. శంకర్ సినిమాల్లో హీరోయిన్ల పాటలు రిచ్‌గా ఉంటాయి కానీ, కథ పరంగా చూస్తే హీరో డామినేషన్ ఎక్కువ. ఈ సినిమాలోనూ కియారా పాత్రకు కథను మలుపు తిప్పేంత ప్రాధాన్యత లేకపోవడం, కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కావడంతో బాలీవుడ్ మీడియాలోనూ దీనిపై చర్చ జరిగింది. 'కల్కి'లో దీపికా పాత్ర కథకు కీలకమే అయినప్పటికీ, యాక్షన్ అంతా హీరోల చుట్టూనే తిరిగింది.

ఇక భారీ అంచనాలతో వచ్చిన డిజాస్టర్‌గా నిలిచిన ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’లోనూ హీరోయిన్ల పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ ఈ సినిమా కోసం చాలా రోజులు కేటాయించారు. చివరకు ‘గ్లామర్‌ షో’కే పరిమితం అయ్యారంటూ విమర్శల పాలయ్యారు.

పాన్‌ ఇండియా సినిమాలు భారీ విజయం సాధించినా హీరోయిన్లకు క్రెడిట్ రావడం లేదు, ఒకవేళ క్యారెక్టర్ బాలేకపోతే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ భామలు కేవలం 'పాన్ ఇండియా' ట్యాగ్ చూసి మోసపోకుండా, క్యారెక్టర్ గ్రాఫ్ ఎలా ఉందో చూసుకున్నాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement