స్టార్ హీరోలు కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరువాత ఇద్దరూ కావాలనే విడివిడిగా నటించడం మొదలెట్టారు. అలాంటిది దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుందన్న వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయాన్ని కమల్ హాసన్, రజనీకాంత్ కూడా నిజమేనని ధ్రువీకరించారు.
రజనీ కూతురి రియాక్షన్
అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దర్శకుడు ఎవరు? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అసలు ఈ చిత్రం తెరకెక్కుతుందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య.. కమల్, రజనీల మల్టీస్టారర్ మూవీ కచ్చితంగా ఉంటుందని ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పేర్కొన్నారు. తన తండ్రి రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే చిత్రాన్ని కమల్‌హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తారని ఆమె స్పష్టం చేశారు.
శ్రుతి హాసన్ ఏమందంటే?
అదే వేడుకలో పాల్గొన్న హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruti Haasan) కూడా కమల్, రజనీ మరోసారి కలిసి నటిస్తే చూడాలన్న ఆశ తనకూ ఉందన్నారు. దీంతో ఈ క్రేజీ కాంబోలో చిత్రం రావడం ఖాయం అనిపిస్తోంది. కాగా కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత వీరు కలిసి నటించింది లేదు.
చదవండి: పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..?


