రణ్‌వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మించిన సినిమా ‘దురంధర్’ విడుదలై రోజులు గడుస్తోంది. పాకిస్థాన్‌లో ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ఓ భారతీయ ఐబీ అధికారి చేసిన ప్రయత్నమే ఈ దురంధర్(Dhurandhar Movie) కథ. సినిమాపై పబ్లిక్ టాక్ భిన్నంగా ఉన్నప్పటికీ అదేదో బలూచిస్తాన్ పాటకు అక్షయ్ ఖన్నా చేసిన డ్యాన్స్‌పై మాత్రం ఇంటర్నెట్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌పై రకరకాల రీళ్లూ ప్రత్యక్షమవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ రివ్యూ చేశాడు. దురంధర్ సినిమా చూసిన పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఈ రివ్యూ సారాంశం... ఇంతకీ అతగాడు ఏమంటాడంటే...
‘‘అయ్యా... దురంధర్ సినిమా ఇప్పుడే చూశా. బాబులూ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా.. సినిమాలో మీరు చూపించినవి ఏవీ పాకిస్థాన్‌లో లేవు. ఒకొక్కటి.. ప్రతి ఒక్కటీ అబద్ధం. అందులో రణ్‌వీర్ సింగ్ ఓ మోటర్ సైకిల్ నడుపుతూంటాడు. అలాంటిది పాకిస్థాన్ మొత్తమ్మీద లేదంటే నమ్మండి. నాయనలారా! ఇంత అత్యాచారాలకు పాల్పడకండి సారూ. స్పె‍్లండర్ బైక్‌నే సూపర్ బైక్ అనుకునే రకాలం మేము. అట్లాంటిది.. మీరు ఆ సినిమాలో ఏమేమో చూపించేశారు.
కరాచీలో అండర్‌పాస్ ఉన్నట్లు చూపారు. ఊహూ... ఎక్కడా అలాంటిది లేదయ్యా.. మాకున్న అండర్‌పాస్‌లు అన్నీ భారత్ సరిహద్దుల్లోనే.. అది కూడా ఉగ్రవాదులను ఇటు నుంచి అటుకు పంపేందుకు మాత్రమే. అయ్యో... స్క్రిప్ట్‌లో లేని విషయమూ చెప్పేశానే. కొంచెం మరచిపోండేం! మిగిలిన విషయాలంటారా?... మేజర్ ఇక్బాల్, రెహ్మాన్ డెకాయిట్, 26/11... వంటివేవీ మేము చేయలేదు. ఒట్టు. ఏంటి అవన్నీ నిజమే అంటావా? లేదు సారు.. అవన్నీ పచ్చి అబద్ధాలు.’’
కోనసీమ వెటకారానికి మించిన హిలేరియస్ రివ్యూ ఇది. మీరూ ఒకసారి చూసేయండి మరి.


