
సౌత్ ఇండియా గాయకుడు విఘ్నేశ్ త్వరలో పెల్లి చేసుకోనున్నాడు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో పలు సాంగ్స్‌తో గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన సంగీత దర్శకుడు, గీత రచయిత కూడా.. ముఖ్యంగా ర్యాప్ పాటల సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళంలో హారీష్ జయరాజ్ సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు పాడారు.
అదే విధంగా డి.ఇమాన్,సత్య సీ, తమన్, శ్యామ్ సీఎస్ జస్టిన్ ప్రభాకరన్ వంటి సంగీత దర్శకుల చిత్రాలకు సౌండ్ ట్రాక్స్ పాడారు. ముఖ్యంగా విఘ్నేశ్ తెలుగులో చాలా పాటలు పాడారు. కాగా ఈయనకు ఇప్పుడు పెళ్లి కళ వచ్చేసింది. శ్వేత ఆనంద్ అనే భరత నాట్య కళాకారిణిని వివాహమాడబోతున్నారు.
ఈమె చెన్నైలో పుట్టి, కెనడాలో నివశిస్తున్న భారతీయ సంతతికి చెందిన యువతి అన్నది గమనార్హం. శ్వేత ఆనంద్ భరతనాట్య కళాకారిణి మాత్రమే కాకుండా, కాస్ట్యూమ్ డిజైనర్, గాయనీ,మృదంగ కళాకారిణి, వయోలిస్ట్ కూడా. కాగా విఘ్నేశ్, శ్వేత ఆనంద్‌ల వివాహం జూన్ నెల 5న చైన్నె సముద్రతీరంలోని దక్షిణ చిత్ర సాంస్కృతిక కళా ప్రాంగణంలో జరగనుంది. ఈ విషయాన్ని వారు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.