కోలీవుడ్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అరసన్'. వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ రెండో షెడ్యూల్ చైన్నెలో జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్‌ను తమిళ సినీ నిర్మాతల మండలి, పెప్సీ కలిసి నిలిపేసినట్లు సమాచారం. ఈ విషయంపై శింబు తండ్రి, దర్శక నిర్మాత టి.రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అరసన్ చిత్రం కోసమో, శింబు కోసమో వాదించడానికి నేను రాలేదు.
ఆ గొడవ ఎప్పుడో అయిపోయింది
తమిళ చిత్ర నిర్మాతల మండలి, దానికి సహకరిస్తున్న దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధర్మంగా ప్రవర్తించకూడదని చెప్పడానికే నేను వచ్చాను. ఇంతకు ముందు శింబు నటించిన 'వెందు తనిందదు కాడు' చిత్ర నిర్మాత ఐసరి గణేష్.. శింబుకు వ్యతిరేకంగా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తర్వాతి సినిమా కోసం రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఆ మూవీ పట్టాలెక్కలేదు. అయితే ఈ కేసులో శింబు సరసన చట్టపరంగా నేను పోరాడి గెలిచాను. నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ శింబుకే చెందుతుంది అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ నకళ్లు నా చేతిలోనే ఉన్నాయి.
నటుడికి మద్దతుగా నిలబడరా?
ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాత కేసును దృష్టిలో పెట్టుకుని నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య.. ఈ రోజు అరసన్ చిత్ర షూటింగ్‌ను నిలిపివేసినట్లు తెలిసింది. ఈ విషయంలో నేడు అడగదలచుకున్నది ఒక్కటే. ఒక నిర్మాత కోసం నిర్మాతల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య పోరాడుతుంటే ఒక నటుడికి దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎందుకు మద్దతుగా నిలబడడం లేదు. ఈ సంఘం నటుడికి మద్దతుగా నిలబడాలి. అతడికి న్యాయం చేయాలి. మంచి పరిష్కారాన్ని చూపాలి అని టి.రాజేంద్రన్ పేర్కొన్నారు.


