సుమన్(Suman)..ఒకప్పుడు స్టార్ హీరో. చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన నటుల్లో ఆయన ఒకరు. అనుకోకుండా ఆయన జైలుకు వెళ్లడం.. ఆరు నెలల పాటు అక్కడే ఉండడంతో ఆయన కెరీర్‌కి పెద్ద దెబ్బ తగిలింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా హీరోగా సినిమాలు చేసినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూనే..మరోవైపు టీవీ సీరియల్స్లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన చేతబడి గురించి వివరించాడు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో ఆయనకు చేతబడి చేశారట. కేరళకు వెళ్లి విరుగుడు పూజ చేయింకున్నాని సుమన్ చెప్పారు.
‘నాపై చేతబడి జరిగిన మాట వాస్తవం. అయితే ఎవరు చేయించారనేది తెలియదు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. బిజినెస్ రంగంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ చేతబడి అనేది కేరళలో చాలా ఫేమస్. అక్కడ చోటనికరే అనే ప్లేస్ ఉంది. అక్కడ చేతబడి జరిగిన వాళ్లకి విరుగుడు పూజ చేస్తుంటారు. ఇందులో రకరకాలుగా ఉంటుంది. ఎందుకు? ఎవరు చేయించారనేది తెలియదు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేరళ వాళ్లకి దీని గురించి బాగా తెలుసు చేతబడి ఎలా ప్రయోగిస్తారు? దాన్ని తగ్గించడం.. మనస్పర్థలు తీసుకుని రావడం లాంటి విద్యలు చేస్తుంటారు. అది ఇప్పటికీ ఉంది.
అప్పట్లో నాకు వరుసగా ఎదురుదెబ్బలే తగులుతుండడంతో కొంతమంది చెబితే అక్కడకు వెళ్లాను. విరుగుడు పూజ ఏదో చేయించారు. అది తప్పు ఒప్పు... ఉంది లేదని నేనేం చెప్పను. కానీ నేను టైమ్‌ని బాగా నమ్ముతా. ఈరోజు ఇది.. ఈ నెల ఇది.. ఈ సంవత్సరం ఇది అంటే అది జరిగితీరుతుంది. ఇది నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా.. మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు. వాడు తొక్కేశాడు.. వీడు నొక్కేశాడు.. ఎక్కేశాడు. వీడి వల్ల అలా జరిగింది.. ఇలా జరిగిందని. బట్.. ఆ టైమ్ అలా జరిపిస్తుంది. ఆ టైమ్ కొందరితో అలా చేయిస్తుంది. నిజానికి వాళ్లకి అలా చేయాలనే ఉద్దేశం ఉండదు. కానీ టైమ్ వాళ్లని అలా చేయిస్తుంది. అది కూడా వాళ్ల రాతే. దాన్నే కర్మ అని అంటారు. కర్మను నేను బాగా నమ్ముతాను. రోగాలు రావడం కూడా కర్మే. టైమ్ని బట్టి రోగాలు వస్తుంటాయి. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని సుమన్ చెపుకొచ్చారు.


