
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాత కూడా. శుభం మూవీతో నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నిర్మించిన శుభం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన సామ్.. ఇటీవల పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ నేపథ్యంలో ఓ బాధాకర సంఘటనను వెల్లడించింది. తన తండ్రి అంత్యక్రియలకు వెళ్తంటే కొంతమంది సెల్ఫీలు అడిగారని గుర్తు చేసుకుంది.
సమంతా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అభిమానులు తన దగ్గరికి ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు తాను ఎప్పుడూ నో చెప్పలేదు. చెన్నైలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలోనే కొంతమంది అభిమానులు ఫోటో తీయడానికి తన దగ్గరికి వచ్చారు. అయినా నేను వారికి నో చెప్పలేదు. ఎందుకంటే తన విజయానికి కారణం తన అభిమానులే. మనం సెలబ్రిటీలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామో వారికి తెలియకపోవచ్చు. అందుకే నేనెప్పుడూ అభిమానుల ఫోటోలకు నో చెప్పను' అని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది
ఆ రోజును గుర్తుచేసుకుంటూ.. 'డిసెంబర్‌లో నాన్న మరణించారని నా తల్లి నుంచి ఉదయం నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ముంబయి నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. కొంతకాలంగా నాన్నతో మాట్లాడకపోవడంతో నేను షాక్‌కు గురయ్యాను. నాలో ఎలాంటి స్పందన లేకుండా విమానంలో కూర్చుండిపోయా. ఆ సమయంలో కొందరు నా ఫోటో కోసం అడిగిన విషయం నాకు గుర్తుంది. నేను నిలబడి వారితో ఫోటోలకు నవ్వుతూ ఉన్నా" అని తెలిపింది. మనం ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు.. తెలియనివారితో ఫోటో అడగడానికి చాలా ధైర్యం అవసరం.. అందుకే నో చెప్పి వారిని బాధపెట్టాలని అనుకోలేదని సమంత వెల్లడించింది.
ఆ సంఘటన తనను ఒక సెలబ్రిటీగా ఉండటంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించేలా చేసిందని సమంత పేర్కొంది. వారితో సెల్ఫీల కోసం నేను నవ్వుతున్నప్పుడు అది నా మనసును తాకిందని.. ఎందుకంటే తండ్రి మరణించిన రోజున ఏ వ్యక్తి నవ్వాలని అనుకోడని వివరించింది. ఇది పూర్తిగా వేరే ప్రపంచమని సమంత తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత 'బంగారం' అనే మూవీలో కనిపించనుంది.