
ఆరోగ్యంగా ఉండటం కోసం బోలెడన్ని ఆహార నియమాలుపాటిస్తుంటారు స్టార్స్. అయితే వారంలో ఒక రోజు ‘చీట్ డే’ అని పెట్టుకుంటారు. ఆ రోజు మాత్రం ఆయిలీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్... ఇలా అన్నీ ఫుల్లుగా లాగించేస్తారు. అయితే సమంత మాత్రం ‘నో చీట్ డే’ అంటున్నారు. వారం మొత్తం ఒకే డైట్‌ని ఫాలో అవుతానని పేర్కొన్నారామె. కాగా మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత సమంత ఆహారం విషయంలో మరింత స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. ‘యాంటీ ఇన్‌ప్లమేటరీ డైట్’ని ఫాలో అవుతున్నారామె.
అంటే... తన శరీరానికి సరిపడేవి, సరిపడనవి ఏవో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా తన డైట్‌ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రతి రోజూ ఒకే రకమైన ఆహారం ప్లాన్ చేసుకుంటారట. రోజువారీ ఆహారంలో ధాన్యాలు, మొలకలు, బెర్రీ, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, నెయ్యి, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి తీసుకుంటానని పేర్కొన్నారీ బ్యూటీ. ‘‘వారంలో ఒకరోజు చీట్ డే అంటూ రొటీన్ డైట్‌ని దూరం పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతిరోజూ ఒకేలా తింటాను’’ అని సమంత అంటున్నారు.