సినీ కార్మికులకు ప్రభాస్‌ నిర్మాత ఆర్థిక సాయం

Salaar Producer Help To Cine Workers - Sakshi

కరోనా వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఎంతో మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. సినీ కార్మికులు కూడా పని లేక పస్తులుండాల్సిన దుస్థితికి చేరుకున్నారు. దీంతో వీరిని ఆదుకునేందుకు పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారికి సాయం అందిస్తున్నారు. నిత్యావసరాలు అందించడంతో పాటు తోచినంత ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.

ఇటీవలే కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ కన్నడ చిత్ర పరిశ్రమలోని మూడు వేల మందికి సాయం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 3 వేల మందికి తలా మూడు వేల రూపాయల చొప్పున మొత్తంగా రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చాడు. తాజాగా 'సలార్‌' నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లో 3,200 మందికి రూ.35 లక్షల సాయాన్ని అందించింది. అలాగే కర్ణాటకలోని మాండ్యాలో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు 20 ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

హోంబలే నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న 'సలార్‌' సినిమా కేవలం పది రోజుల చిత్రీకరణను మాత్రమే పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ చిత్రం కోసం పని చేస్తున్న యూనిట్‌ సభ్యులందరికీ రూ.5000 చొప్పున అందించి ఈ లాక్‌డౌన్‌ కాలంలో వారి కుటుంబాలకు అండగా నిలబడింది. గతేడాది కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలోనూ 350 మంది కన్నడ సినీ కార్మికులకు రెండు నెలలపాటు ఆర్థికంగా సాయం చేసి బాసటగా నిలిచిందీ హోంబలే నిర్మాణ సంస్థ. 

ఇక సలార్‌ సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా ఉధృతి తగ్గాక సలార్‌ చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది.

చదవండి: ప్రభాస్‌ ‘సలార్‌’ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌!‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top