పండగే పండగ

Sakshi special story about Tollywood movies

ఆదివారం దశమి. అందరికీ పండగ. సినిమా ప్రేమికులకు డబుల్‌ పండగలా మారింది. కొన్ని నెలలుగా కొత్త సినిమా కబుర్లు లేక డల్‌గా ఉన్నారంతా. అయితే పండగ రోజు వాళ్లలో జోష్‌ నింపాయి సినిమా విశేషాలు. కొత్త సినిమాల ముహూర్తాలు, టీజర్లు, లుక్స్‌ రిలీజులు, విడుదల తేదీ ప్రకటనలు.. అబ్బో సందడే సందడి. పండగే పండగ. ఆ విశేషాలన్నీ మీ కోసం.

రెండో సినిమా షురూ
‘మత్తువదలరా’తో హీరోగా పరిచయమైన సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి రెండో చిత్రం ఆరంభమైంది. మనికాంత్‌ దర్శకత్వంలో సాయి కొర్రపాటితో కలిసి రజినీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రా శుక్ల, మిషా నారంగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి క్లాప్‌ ఇచ్చారు. యం.యం. కీరవాణి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్‌ రగుతు.

నాగచైతన్య థాంక్యూ అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్‌ సత్య రంగయ్య క్లాప్‌ కొట్టారు. ‘‘ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌ , కెమెరా: పీసీ శ్రీరామ్‌.

జోహార్లు
శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తిరుపతిలో ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కెమెరా స్విచాన్‌ చెయ్యగా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు. అనగాని సత్యప్రసాద్, 14 రీల్స్‌ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపిచంద్‌ ఆచంట స్క్రిప్ట్‌ను అందించారు. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఎస్‌.ఎల్‌.వి.సి పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్‌ సారంగ్‌ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.

డిఫరెంట్‌ సింగరాయ్‌
నాని హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మించనున్న ఈ సినిమా డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయిపల్లవి, క్రితి శెట్టి కథానాయికలు. ‘‘ఈ సినిమాలో నాని కొత్తగా కనిపించబోతున్నాడు. నాని లుక్, డ్రెస్సింగ్‌ వైవిధ్యంగా ఉండబోతున్నాయి. డిసెంబర్‌ నుండి నాని ఈ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సాను జాన్‌ వర్గీస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌).

మళ్లీ పోలీస్‌
‘గబ్బర్‌సింగ్‌’ సినిమాలో పోలీస్‌ పాత్రలో నటించిన పవన్‌ కల్యాణ్‌ మరోసారి పోలీసాఫీసర్‌ పాత్రలో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ఈచిత్రానికి సంగీత దర్శకుడు: తమన్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల.

పవర్‌ఫుల్‌ ఆద్య
‘బద్రి, జానీ’ వంటి చిత్రాలతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న రేణూ దేశాయ్‌ తాజాగా ఒక పవర్‌ఫుల్‌ లేడీ ఓరియంటెడ్‌  ప్యాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌ ‘ఆద్య’తో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. ఎం.ఆర్‌. కృష్ణ మామిడాల దర్శకత్వంలో యు అండ్‌ ఐ పద్మనాభరెడ్డి సమర్పణలో డి.ఎస్‌.కె.స్క్రీన్‌–సాయికృష్ణ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై డి.ఎస్‌.రావు– రజనీకాంత్‌. ఎస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త చింతిరెడ్డి అనంత్‌ రెడ్డి దర్శకుడు కృష్ణకు అందించారు. రేణూ దేశాయ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు నీలకంఠ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డి.ఎస్‌.రావు క్లాప్‌ ఇచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యే గొప్ప కథ ఇది’’ అన్నారు రేణూ దేశాయ్‌. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్‌.

పేరు జోకర్‌
‘మేరా నామ్‌ జోకర్‌’ పేరుతో ఓ సినిమా ప్రారంభం అయింది. 4ఏయం మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సూర్యగోపాల్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ శివ ఎన్, ఎస్‌.జి. కృష్ణ, నవీన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి షాట్‌కు దర్శకుడు క్లాప్‌ ఇచ్చి, స్క్రిప్ట్‌ను దర్శకుడు గోపాల్‌కి అందించారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్‌లో ఆరంభం కానుంది.

కోతికొమ్మచ్చి
మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్నలు హీరోలుగా ‘కోతికొమ్మచ్చి’ సినిమా ప్రారంభం అయ్యింది. వేగేశ్న సతీశ్‌ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఎల్‌.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ‘దిల్‌’ రాజు క్లాప్‌నివ్వగా, ‘అల్లరి’ నరేశ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను నవంబర్‌ 3న అమలాపురంలో ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు వేగేశ్న సతీశ్‌.

అమ్మ సెంటిమెంట్‌తో...
హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా ఆయుషి హీరోయిన్‌గా నూతన చిత్రం ప్రారంభమయింది. డి.ఎస్‌. రాథోడ్‌ దర్శకత్వంలో డీఎస్‌ఆర్‌ ఫిలిం ప్రొడక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్‌నివ్వగా, కె.యస్‌. రవికుమార్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ‘‘అమ్మ సెంటిమెంట్‌తో వస్తున్న డిఫరెంట్‌ చిత్రం ఇది. తాండూర్‌లో నవంబర్‌ 8న షూటింగ్‌ మొదలు పెడతాం. రెండో షెడ్యూల్‌ను నవంబర్‌ చివరివారంలో హైదరాబాద్‌లో జరిపి, తర్వాత బ్యాంకాక్‌ వెళతాం’’ అన్నారు దర్శకుడు.

సంక్రాంతికి వస్తున్నాం
కరోనా వల్ల ఈ ఏడాది కొత్త సినిమాల విడుదల సందడంతా మిస్సయింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి సందడి రెండింతలు ఉండేలా ఉంది. సంక్రాంతి బరిలో దిగడానికి చాలా సినిమాలు సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. దసరా పండగ సందర్భంగా సంక్రాంతికి సీట్‌ను పలు సినిమాలు బుక్‌ చేసుకున్నాయి. ఆ విశేషాలు.

‘డాన్‌ శీను, బలుపు’ తర్వాత రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘క్రాక్‌’. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. పవర్‌ఫుల్‌ పోలీస్‌ కథగా ఈ సినిమా ఉంటుంది. ‘సంక్రాంతికి థియేటర్స్‌లో క్రాక్‌ పెట్టిద్దాం’ అన్నారు రవితేజ. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. పూజా హెగ్డే కథానాయిక. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేసి, సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించారు. అలాగే కొన్ని రోజుల కిత్రమే రానా కూడా సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించారు. ఆయన నటించిన ‘అరణ్య’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. మరి.. సంక్రాంతి రేసులో మరికొన్ని సినిమాలు జాయిన్‌ అవుతాయా? చూడాలి.

ప్రేమ.. పెళ్లిళ్లు
‘‘1992’ టైటిల్‌తో పాటు నేను విడుదల చేసిన పాట ఆసక్తికరంగా ఉంది. కొత్తవారు చేస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. శివ పాలమూరి దర్శకత్వంలో మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘1992’. ఈ సినిమాలోని లిరికల్‌ వీడియోస్‌ని వీవీ వినాయక్, నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ‘‘నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా ఉన్నాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు హీరో, నిర్మాత మహి రాథోడ్‌.

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌
విశ్వంత్‌ దుద్దుంపూడి, మాళవిక సతీషన్‌ జంటగా సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హయర్‌’. స్వస్తిక సినిమా మరియు ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని విశ్వంత్, మాళవిక ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అశ్రిన్‌ రెడ్డి, సంగీతం: గోపి సుందర్, కెమెరా: బాల సరస్వతి.


∙బీవీఎస్‌ రవి, విక్రమ్‌ కె.కుమార్, శిరీష్, పీసీ శ్రీరామ్, ‘దిల్‌’రాజు నాగచైతన్య


రవితేజ, శ్రుతీహాసన్‌


Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top