
రుక్మిణి వసంత్. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. ఎందుకంటే ఈమె స్వతహాగా కన్నడ. కానీ 'సప్త సాగరాలు దాటి' అనే డబ్బింగ్ మూవీతో మనోళ్లకు కాస్త పరిచయం. అలాంటిది ఇప్పుడు 'మదరాశి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇది కాదు అసలు విషయం. ఈమె చేతిలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ లైనప్ చూస్తేనే మిగతా హీరోయిన్స్ అసూయ పడతారేమో అనిపిస్తుంది.
శివకార్తికేయన్-మురుగదాస్ కాంబోలో తీసిన 'మదరాశి'లో రుక్మిణి వసంత్ హీరోయిన్. అయితే ఈ సినిమాలో ఈమె పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందనేది తెలీదు. బేసిగ్గా ఈ మూవీపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత ఎన్వీ ప్రసాద్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని బయటకు చెప్పేశారు. అలానే కాంతార సీక్వెల్, యష్ 'ట్యాక్సిక్'లోనూ ఈమెనే కథానాయిక అని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్‌బాస్ జంట సర్‌ప్రైజ్)
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో హిట్స్ కొడుతూ వరస సినిమాలు చేస్తున్న హీరోయిన్ అంటే అందరికీ రష్మికనే గుర్తొస్తుంది. కానీ రుక్మిణి వసంత్ లైనప్ చూస్తుంటే రష్మికలానే ఈమె కూడా నెక్స్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే నెలలో రాబోతున్న 'కాంతార' సీక్వెల్‌లో ఈమె యువరాణి పాత్ర చేసింది. అలానే వచ్చే ఏడాది మార్చిలో ట్యాక్సిక్, వేసవిలో నీల్-తారక్ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇవన్నీ కచ్చితంగా హిట్ బొమ్మల్లానే కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం రుక్మిణి.. మోస్ట్ వాంటెడ్ అయిపోవడం గ్యారంటీ.
రీసెంట్‌గా మొదలైన వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమాలోనూ హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు. కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ భవిష్యత్తు.. రాబోయే 10 నెలల్లో ఏ మేరకు మారబోతుందో చూడాలి?
(ఇదీ చదవండి: సూపర్‌స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే?)