
గతవారం వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ వచ్చింది. కానీ స్టార్ హీరోలు, మిడ్ హీరోల చిత్రాలేవి థియేటర్లలోకి రాలేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి, సుందరకాండ తదితర చిన్న మూవీస్ వచ్చాయి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు స్క్రీనింగ్ సమస్యలు ఎదుర్కొని, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన 'కొత్త లోక' అనే డబ్బింగ్ సినిమా.. మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఓవరాల్‌గా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత?
మలయాళ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు సూపర్ హీరో యూనివర్స్ సృష్టించారు. అందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. దీన్ని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. పురాణగాథల్లో ఉన్న యక్షిణి పాత్రని తీసుకుని, సూపర్ హీరో కాన్సెప్ట్ జోడించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే మలయాళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వచ్చింది.
(ఇదీ చదవండి: 'కొత్త లోక' రివ్యూ)
మలయాళంలో ఆగస్టు 28న రిలీజ్ కాగా.. ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. ఇప్పటివరకు నాలుగు రోజులు పూర్తి కాగా దాదాపు రూ.40-45 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే రూ.3.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తోంది.
మలయాళంలో దీనితో పాటు సూపర్‌స్టార్ మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా కూడా రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ దీనికి రూ.11-15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 'కొత్త లోక'నే ముందంజలో ఉంది. అయితే ఈ సినిమాని కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్‌తోనే తీశారట. అంటే లాంగ్ రన్‌లో ఈ సినిమాకు మంచి లాభాలు రావడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్‌బాస్ జంట సర్‌ప్రైజ్)
