హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ | Kalyani Priyadarshan's Kotha Loka: Chapter 1 Chandra Review A Unique Superhero Tale in Malayalam | Sakshi
Sakshi News home page

Kotha Lokah Review: కల్యాణి ప్రియదర్శన్ 'కొత్త లోక' రివ్యూ

Aug 30 2025 3:30 PM | Updated on Aug 30 2025 4:15 PM

Kotha Lokah Chapter 1 Chandra Telugu Review

మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్.. అఖిల్ 'హలో' మూవీతో హీరోయిన్ అయింది. 'చిత్రలహరి' అనే మరో తెలుగు సినిమా కూడా చేసింది. తర్వాత పూర్తిగా సొంత భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడు ఈమె.. ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. అదే 'కొత్త లోక: ఛాప్టర్ 1 చంద్ర'. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ.. ఆగస్టు 28న మలయాళంలో రిలీజ్ కాగా, ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు.  ఓ సందర్భంలో బెంగళూరు వస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ(నస్లేన్) ఫ్రెండ్స్‌తో కలిసి నివసిస్తుంటాడు. చంద్రని చూసి సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప (శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. రీసెంట్ టైంలో 'హనుమాన్' పేరుతో తెలుగులోనూ ఓ మూవీ వచ్చింది. ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరో జానర్‌లో ఏకంగా ఓ యూనివర్స్ సృష్టించారు. ఇందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. తెలుగులో దీన్ని 'కొత్త లోక' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్‌తో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది. అందుకు తగ్గట్లే థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఇచ్చింది.

చంద్ర ఓ పవర్ ఫుల్ ఫైట్‌ చేయడంతో సినిమా మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల బెంగళూరు రావడం, ఇక్కడ ఎదురింట్లో ఉండే సన్నీతో పరిచయం.. ఇలా పాత్రలు, పరిస్థితుల్ని చూపిస్తూ వెళ్లారు. ఓ సాధారణ అమ్మాయిలా బతుకుదాం అని వచ్చిన చంద్ర.. ఒకడిని కొట్టడంతో ఈమె లైఫ్‌లోకి ఓ రౌడీ గ్యాంగ్ వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి చంద్ర లైఫ్ ఎలా టర్న్ అయింది. చివరకు ఏమైందనేదే తెలియాలంటే సినిమా చూడాలి.

ఈ సినిమా ఫస్టాప్ అంతా ఎంగేజింగ్‌గా ఉంటుంది. హీరోయిన్‌కి ఉన్న సూపర్ పవర్స్, అందుకు తగ్గట్లు అక్కడక్కడ ఫైట్ సీక్వెన్స్ లు ఎంటర్‌టైన్ చేస్తాయి. సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. కానీ చివరకొచ్చేసరికి రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే ఓ డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. సాధారణంగా ఫిమేల్ సెంట్రిక్ కథలు అనగానే సింపతీనే చూపిస్తుంటారు. ఇందులో అణిచివేతకు ఎదురు నిలబడిన యోధురాలిగా చంద్ర పాత్రని ప్రెజెంట్ చేశారు.

యక్షిణి పాత్ర గురించి మనం పురాణాల్లో విన్నాం. అయితే ఆ పాత్రని తీసుకుని సూపర్ హీరో తరహా స్టోరీగా మార్చడం.. బ్యాట్ మ్యాన్ టైపులో చూపించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత కథని పూర్తి చేయలేదేంటి అనే సందేహం వస్తుంది. అవును అదే నిజం. కేవలం చంద్ర పాత్ర తాలూకు బలాలు, బలహీనతలు చూపించారు. తర్వాత రాబోయే పార్ట్-2 చిత్రానికి లీడ్ వదిలారు. ఇందులో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంది. అది కొన్నిచోట్ల వర్కౌట్ అయింది.

ఎవరెలా చేశారు?
కల్యాణి ప్రియదర్శిని ఇప్పటివరకు కమర్షియల్ పాత్రలు ఎక్కువగా చేసింది. ఇందులో చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా ఆకట్టుకుంది. ఫైట్స్ ఇరగదీసింది. చంద్ర వెంటపడే అమాయకమైన కుర్రాడిగా నస్లేన్ బాగా చేశాడు. అతడి ఫ్రెండ్స్‌గా చేసిన ఇద్దరు కుర్రాళ్లు కామెడీ బాగానే చేశారు. నాచియప్ప అనే విలన్ తరహా పాత్ర చేసిన శాండీ.. స్వతహాగా కొరియోగ్రాఫర్. కానీ యాక్టింగ్ కూడా బాగా చేశాడు. మిగిలిన వాళ్లు ఆకట్టుకున్నారు. ఇందులోనే 'కూలీ' ఫేమ్ సౌబిన్ షాహిర్, హీరోలు టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో అలా మెరిశారు.

టెక్నికల్ అంశాలకొస్తే.. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్. రెడ్-బ్లూ కలర్స్‌ని ఉపయోగించిన విధానం బాగుంది. తెలుగు డబ్బింగ్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి తగ్గట్లు ఉంది. డొమినిక్ అరుణ్.. దర్శకుడిగా కంటే రైటర్‌గా ఎక్కువగా ఆకట్టుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసినా సరే ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. కథలో మైథాలజీ ఉంది. కొత్త పాయింట్ ఉంది. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు కూడా బాగుంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలు కాదు ఏదైనా కొత్తగా చూద్దామనుకుంటే మాత్రం ఇది డోంట్ మిస్.

- చందు డొంకాన

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement