Nandamuri Taraka Ratna Death : నందమూరి తారకరత్న మరణానికి కారణాలు ఇవేనా?

Reasons Behind Nandamuri Taraka Ratna Death - Sakshi

నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న ఇకలేరన్న విషయాన్ని నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆశగా చూసిన ఎదురుచూపులు అడియాసలు అయ్యాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 40ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

జనవరి 27న నారా లోకేష్‌ ప్రారంభించిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను కుప్పంలోకి స్థానిక​ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అదేరోజు అర్థరాత్రి బెంగళూరుకు షిఫ్ట్‌ చేశారు. అప్పట్నుంచి నిపుణలైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. గత వారం రోజులుగా నిపుణులైన విదేశీ వైద్యులను సైతం రప్పించి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ క్రమంలో తారకరత్న మరణానికి దారితీసిన కారణాలను ఓసారి విశ్లేషిస్తే.. తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో సుమారు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయింది. ఆ సమయంలో రక్తం గడ్డకట్టడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చినట్టు తెలిసింది.గుండె, కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ మెదడు దెబ్బతినడంతో కోలుకోలేకపోయారు. దీనికి తోడు ఆయనకు మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు గుర్తించారు.

బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయానికే ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. గుండెలో 90% బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించారు. చిన్న వయసే కావడంతో పరిస్థితి మెరుగు అవుతుందని భావించారు. మధ్యలో పరిస్థితి కొంచెం మెరుగైందని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా, రెండు రోజులుగా పరిస్థితి మరీ క్షీణించడంతో విషమంగా మారింది. ఈ నేపథ్యంలో గతరాత్రి శివరాత్రి పర్వదినాన తారకరత్న శివైక్యం చెందినట్లు ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top