'ధురంధర్' రెండు సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన హీరో రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం. బాలీవుడ్‌లో ఇకపై ఇతడు సినిమాలు చేయడం కష్టమే అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి కారణం 'డాన్ 3' అనే మూవీ. సడన్‌గా తప్పుకోవడంతో ఆ చిత్ర దర్శకనిర్మాత.. రణ్‌వీర్‌పై ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. మరి ఈ నిషేధం వల్ల రణ్‌వీర్‌కి నష్టమేంటి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
హిందీ హీరోల్లో రణ్‌వీర్ సింగ్ పేరున్న హీరోనే. పద్మావత్, రామ్ లీల్ లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఇతడికి గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేది లేదు. సరిగ్గా ఈ టైంలో 'ధురంధర్' మూవీస్ సక్సెస్ కావడం ఇతడి గ్లోబల్ వైడ్ గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ చిత్రాల్లో నటించడానికి ముందే 'డాన్ 3' అనే ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాడు.
2023 ఆగస్టులోనే 'డాన్ 3'కి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లు అని అనౌన్స్ చేశారు. అయితే పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. 'ధురంధర్' రావడానికి ముందు కూడా ఫర్హాన్, రణ్‌వీర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్ వినిపించింది. తర్వాత కొన్నాళ్లకు రణ్‌వీర్ ఈ మూవీ నుంచి తప్పుకొన్నాడు. అయిత షూటింగ్ మొదలవడానికి కొన్నివారాల ముందు ఇలా చేయడంతో తమకు రూ.40-45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్(FWICE)ని ఆశ్రయించాడు.
ఈ క్రమంలోనే సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడంతో అంతా షాకయ్యారు. అయితే ఈ ఆదేశం చట్టపరమైన నిషేధం కాదు. కాకపోతే ఈ ఫెడరేషన్‌కి అనుబంధంగా ఉన్న కార్మికులు, టెక్నీషియన్లు, ఇతర సినీ ఉద్యోగులు రణవీర్ సింగ్‌తో కలిసి పని చేయడానికి కుదరదు. బాలీవుడ్ చాలావరకు ఈ వర్గాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల, ఇది సదరు హీరో భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఈ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ తరఫు ప్రతినిధి మాత్రం పబ్లిక్‌గా దీని గురించి స్పందించడం ఇష్టం లేదని.. వృత్తిపరమైన విభేదాలను వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని రణవీర్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనంతటికి 'ధురంధర్' సక్సెస్ కారణమా అని సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయినా సరే బాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకనిర్మాతలు కనీసం స్పందించలేదు. బహుశా ఈ కారణంతోనే రణ్‌వీర్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్‌తో నిశ్చితార్థం)


