మెగా అభిమానులు గమనించారో లేదో గానీ రామ్ చరణ్ విషయంలో చిన్న మార్పు జరిగింది. కాకపోతే చాలా తక్కువమంది మాత్రమే సోషల్ మీడియాలో దీన్ని గమనించారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి సంగతి?
చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్.. 'మెగా పవర్ స్టార్' అనే ట్యాగ్‌తోనే తొలి నుంచి సినిమాలు చేశాడు. కానీ 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'గ్లోబల్ స్టార్' అనే ట్యాగ్‌ని అటు చిత్ర నిర్మాతలు గానీ ఇటు అభిమానులు గానీ గట్టిగానే ప్రమోట్ చేశారు. మొన్నటి వరకు ఈ ట్యాగ్ తరచుగా కనిపించేది. కానీ ఇప్పుడది మాయమైపోయింది. అవును మీరు విన్నది నిజమే.
(ఇదీ చదవండి: పవన్‌కి రెడ్ కార్డ్.. ఈ వారం మాధురి ఎలిమినేట్!)
ప్రస్తుతం చరణ్ 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. శ్రీలంకలో ఈ మధ్యే సాంగ్ షూట్ కూడా చేశారు. తాజాగా శనివారం హఠాత్తుగా హీరోయిన్ జాన్వీ కపూర్ పోస్టర్స్ రెండు రిలీజ్ చేశారు. ఈ మూవీలో జాన్వీ.. అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుందని ప్రకటించారు. ఈ పోస్టర్స్‌లో రామ్ చరణ్ పేరుకి ముందు మళ్లీ పాత ట్యాగ్ 'మెగా పవర్ స్టార్' అని కనిపించింది. దీంతో మళ్లీ ఎందుకు మార్చేశారా అని మాట్లాడుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం చరణ్ అంగీకారంతోనే ఈ ట్యాగ్ మార్పు జరిగిందని, ఇకపై ఇదే ట్యాగ్ వాడాలని అనుకుంటున్నారట. ఇదేనా లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. 'పెద్ది' సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్)


