
విలేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పెద్ది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం‘పెద్ది’. ఈ మల్టీస్పోర్ట్స్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రోడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలో ఓ భారీ విలేజ్ సెట్‌ని ‘పెద్ది’ సినిమా కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సెట్‌లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు మేకర్స్. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్‌ను ‘ఇన్ స్టా’లో షేర్ చేశారు రామ్‌చరణ్. ‘‘ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ షెడ్యూల్‌తో కీలక దశకు చేరుకుంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ విడుదల కానుంది.