Panchathantram Review: ‘పంచత్రంతం’ మూవీ రివ్యూ

Panchathantram Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌:  పంచతంత్రం
నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, నరేశ్‌ ఆగస్త్య,శివాత్మిక రాజశేఖర్‌, ఉత్తేజ్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు:టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్  
నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు
కథ, స్క్రీన్‌ప్లే:
దర్శకత్వం: హ‌ర్ష పులిపాక
సంగీతం:ప్రశాంత్ ఆర్ విహారి 
సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి
ఎడిటర్‌:గ్యారీ బి హెచ్ 
విడుదల తేది: డిసెంబర్‌ 9 , 202

బాల్యంలో మ‌నం పంచ‌తంత్ర క‌థ‌లు పుస్తకం చ‌దువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి క‌థ‌ల ఇన్సిపిరేష‌న్ తో తెర‌కెక్కిన యాంథాలజీ చిత్రం ‘పంచ‌తంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబర్‌ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ..కథనం
ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేసి రిటైర్డ్‌  అయిన వేదవ్యాసమూర్తి(బ్రహ్మానందం)రైటర్‌గా ఎదగాలనుకుంటాడు. కానీ అతని కూతురు డాక్టర్‌ రోషిణి(స్వాతి)మాత్రం వయసును గుర్తు చేస్తూ తండ్రిని నిరుత్సాపరుస్తుంది. ఇప్పటి యువతను కథలతో మెప్పించడం సాధ్యం కాదంటూ తండ్రిని ఎగతాళి చేస్తుంది. అయితే వ్యాస్‌ మాత్రం కూతురి మాటలు పట్టించుకోకుండా స్టోరీ టెల్లింగ్‌ కాంపిటీషన్‌కు వెళతాడు. అక్కడ ఐదు కథలు చెబుతాడు.దానికి పంచేంద్రియాలు అని పేరు పెడతాడు. దృశ్యం, రుచి, స్పర్శ, వాసన, వినికిడి అంశాల ఆధారంగా ఈ ఐదు కథలు సాగుతాయి. 

ఇందులో మొదటి కథ సాగర తీరాన్ని(బీచ్‌) చూడాలనుకునే ఓ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ది. ఇందులో నరేశ్‌ అగస్త్య, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించారు. విహారి(నరేష్ అగస్త్య) సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా పని చేస్తూ స్నేహితులతో సరదాగా గడుపుతాడు.అతని ఒక్కసారి కూడా బీచ్‌కి వెళ్లలేదు. స్నేహితుల మాటల్లో సాగరతీరం ఎలా ఉంటుందో విని.. ఒక్కసారైనా బీచ్‌ని చూడాలని తపన పడతాడు. మరి తన కోరిక ఎలా నేరవేరిందనేదే మిగతా స్టోరీ.  ఇది కాస్త నెమ్మదిగా, చప్పగా సాగుతుంది. ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ కాదు. 

రెండోది చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయి జ్ఞాపకాలను తడిమి చూడాలనుకునే ఓ యువకుడిది. ఈ స్టోరీ లో శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సుభాష్‌(రాహుల్‌ విజయ్‌)కి ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. అయితే ఏ అమ్మాయి అతనికి నచ్చదు.చివరకు తల్లి కోసం లేఖ(శివాత్మిక)తో పెళ్లికి ఓకే చెబుతాడు. పెళ్లికి ముందు వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకునే క్రమంలో ఇష్టమైన ప్రదేశం..చిన్నప్పటి లవ్‌స్టోరీని షేర్‌ చేసుకుంటారు. . ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళికి ఓకే చేసినప్పుడు అది పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఎలా చెప్పగలం? అసలు ఒక అమ్మాయి, అబ్బాయికి ఉండాలిసింది ఏంటి? అనేది ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ గా చూపించారు.

ఇక మూడోది మానసిక రోగానికి గురైన ఓ రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ది. రామనాథం(సముద్ర ఖని) ఉద్యోగవిరమణ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. మరో పక్షం రోజుల్లో కూతురికి డెలివరీ ఉందనగా..అతనికి ఓ వింతవ్యాధి సోకుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పటికీ అతనికి మాత్రం బ్యాడ్‌ స్మెల్‌ వస్తుంటుంది.తన ప్రవర్తనతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తాడు.అసలు అతనికి మాత్రమే చెడు వాసన ఎందుకు వస్తుంది? ఆ అరుదైన మానసిక వ్యాధి అతనికి ఎలా సోకింది? చివరకు ఆ వ్యాధి నుంచి రామనాథం ఎలా భయటపడ్డాడు అనేదే మిగతా కథ. ఇందులో సముద్రఖని తనదైన నటనతో అదరగొట్టేశాడు.

నాలుగో కథ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులది. కొత్తగా పెళ్లైన దంపతులకు ఊహించని కష్టం వస్తుంది. ఆ సమయంలో వీరిద్దరు ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారనేదే ఈ కథ సారాంశం. ప్రాణాలు పోయినా సరే విడిపోకుండా కలిసి ఉండే ఓ అనోన్యమైన యవజంట కథ ఇది.  కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చే ఈ కథకి ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అవుతుంది.ఈ స్టోరీ లో దివ్య శ్రీపాద, వికాస్ ఇద్దరు అన్యోన్య దంపతులు గా చక్కగా నటించారు.

ఇక ఈ యాంథాలజీలో చివరిది 5వ కథ చాలా స్పూర్తిదాయకమైనది.ఇందులో స్వాతి ప్రధాన పాత్ర పోషించింది. లియా( స్వాతి) ఒక ఎంట్రప్రినర్. ప్రతి రోజు పాడ్ కాస్టింగ్ లో లియా స్టోరీస్ చెప్తుంటుంది. ఆ పాడ్ కాస్ట్ విని లియా ని ఎంతగానో అభిమానించే చిన్నారులు ఉంటారు. ఆ క్రమంలో పాడ్ కాస్టింగ్ ప్రోగ్రామ్ ఎండ్ చేసి, నెస్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ, రూపా అనే చిన్నారి వల్ల, ఆ పాడ్ కాస్టింగ్ కి మరింత వెయ్యి రేట్లు ప్రాణం పోస్తుంది. అసలు ఆ చిన్నారి ఎవరు? ఏం చేసింది? ఆ పాప ప్రాముఖ్యత ఏంటి? అనేదే మిగతా స్టోరీ. ఇది చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.క్లైమాక్స్‌ హర్ట్‌ని టచ్‌ చేస్తుంది.

మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’.. మంచి సందేశాన్ని ఇచ్చింది. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది.  ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లు... వాటిని న‌డిపించ‌డానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి. కాకపోతే కొన్ని ఎపిసోడ్స్‌లో అక్కడక్కడ సాగదీత గా అనిపిస్తుంది. ‘కెరియర్‌ అంటే 20ల్లోనే కాదు 60ల్లోనూ మొదలు పెట్టొచ చ్చు’, ‘కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి’, 'వదులుకోవడం ఎంత సేపు? క్షణం పట్టదు'  లాంటి డైలాగ్స్‌ హృదయాలు హత్తుకుంటాయి. బ్రహ్మానందం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ విహారి  పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్‌, ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. ఇలాంటి చిత్రాలను నిర్మించాలంటే అభిరుచి ఉండాలి.  కమర్షియల్‌ లెక్కలు వేసుకోకుండా అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు ఈ సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ఎలాంటి అశ్లీలత, ద్వందార్థాలకు చోటులేకుండా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’ ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి.
- అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top