ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణించారంటూ తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, ఆ సందర్భంగా భారతీయ వీడియో క్లిప్పింగులను ప్రదర్శించినందుకు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'జియో న్యూస్' చిక్కుల్లో పడింది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఛానల్‌కు నోటీసులు జారీ చేసింది.
తప్పుడు వార్తలు ప్రసారం
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. శనివారం తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. సోమవారం ఆమె అంతక్రియలు జరిగాయి. అయితే ఆమె అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగానే.. ఆశా భోంస్లే మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్‌కు చెందిన 'జియో న్యూస్' కూడా ఈ పుకార్లను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది.
పాటలతో పాటు వీడియో క్లిప్పింగులు
ఆశా భోంస్లే మరణవార్తను కవర్ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా ఛానల్‌లో ప్రసారం చేశారు. పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేయొద్దు. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పెమ్రా సీరియస్ అవుతూ.. సదరు న్యూస్ ఛానల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.దీనిపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్‌పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
తప్పేముంది?
పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ స్పందిస్తూ.. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు, వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు, వారి కృషిని పునఃపరిశీలించి, కీర్తించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. నిజానికి, ఆశా భోస్లే వంటి గొప్ప కళాకారిణికి సంబంధించి, ఆమె కాలాతీతమైన, చిరస్మరణీయమైన పాటలను మనం పంచుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పంచుకోవాల్సింది. అయినప్పటికీ పెమ్రా (PEMRA), దీనిని పరిమితం చేయాలని నిర్ణయించుకుంది’ అని అబ్బాస్ ట్వీట్ చేశారు.
భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేశారన్న సాకుతో నోటీసులు ఇవ్వడాన్ని పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. కళాకారులకు నివాళులర్పించడాన్ని కూడా నేరంగా చూడటం ఏంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. భారతీయ సంస్కృతి, కంటెంట్ పట్ల పాక్ ఆర్మీకి ఉన్న భయానికి ఇది నిదర్శనమని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.
PEMRA has issued a show-cause notice to Geo News for airing content related to the legendary subcontinent singer Asha Bhosle.
It has always been customary to revisit and celebrate the work of iconic artists when reporting on them. In fact, for an artist of Asha Bhosle’s stature,… pic.twitter.com/AuhFPyGZCL— Azhar Abbas (@AzharAbbas3) April 13, 2026


