
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు 'పాపా బుకా' చిత్రం రేసులో ఉంది. కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు ఎంట్రీ ఇచ్చింది. పా. రంజిత్ ట్వీట్ తర్వాత ఈ చిత్రం ట్రైలర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. పపువా న్యూ గినీ ద్వీపానికి చెందిన నోయెలెన్ తౌలా, పా. రంజిత్ (Pa. Ranjith), అక్షయ్ కుమార్ పరిజా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
మూడు జాతీయ అవార్డులతో రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళ దర్శకుడు బిజుకుమార్ దమోదరన్ 'పాపా బుకా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19, 2025న పపువా న్యూ గినియా దేశంలోని థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలు, అకాడమీ అవార్డుల కోసం లాస్ ఏంజిల్స్‌లో ప్రదర్శించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పీఎన్‌జీలో పోరాడిన భారతీయ సైనికుల గురించి ఈ చిత్రం చూపుతుంది.

ఈ సినిమా గురించి పా రంజిత్ ఏం చెప్పారంటే..
పా రంజిత్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు పాపా బుకా అధికారికంగా ఎంపికైంది. పపువా న్యూ గినియా దేశం ఎంట్రీగా ఎంపికైందని చెప్పడానికి గర్వంగా ఉంది. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా..రెండు దేశాల సహ-నిర్మాణంలో భాగం కావడం నీలం ప్రొడక్షన్స్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణానికి మద్దతుగా, అలాగే ఈ కథను ప్రపంచ వేదికకు తీసుకెళ్లడంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమిది. ఈ సినిమా ద్వారా మరిన్ని ప్రశంసలు పొందడం రెండు దేశాలకు గర్వకారణం. ఈ ఘనత సాధించిన పాపా బుకా చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేశారు.