
భారత్‌లో ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికలు వైవిధ్యమైన కంటెంట్‌తో వీక్షకుల మది దోచుకుంటున్నాయి. ప్రధానంగా వెబ్ సిరీస్‌లకు జనం పట్టం కడుతున్నారు. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్‌లో వెబ్ సిరీస్‌లదే హవా.
వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్‌లో 80 శాతం వాటా వెబ్ సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం. అంతేగాక టాప్–10లో మొదటి తొమ్మిది స్థానాల్లోనూ ఇవే ఉండడం చూస్తుంటే వీక్షకుల ఆసక్తి ఇట్టే అర్థం అవుతోంది. ‘క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్’ హిందీ సిరీస్ ఏకంగా 2.77 కోట్ల మంది వ్యూయర్స్‌తో దేశంలో టాప్‌లో నిలిచింది. టాప్–50లో అయిదు సినిమాలు, అయిదు రియాలిటీ షోలు చోటు సంపాదించాయి. భాషల పరంగా చూస్తే హిందీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్–50 జాబితాలో అత్యధికంగా 16 సిరీస్, సినిమాలు, రియాలిటీ షోలతో జియో హాట్‌స్టార్ ముందంజలో ఉంది.