
ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండస్ట్రీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు. అదే నేను పెట్టుకున్న కండీషన్’ అని అన్నారు హీరోయిన్ నిహారిక ఎన్ ఎం. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నిహారిక..‘మిత్ర మండలి’తో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయేందర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ ‘పెరుసు’(నిహారిక నటించిన తొలి తమిళ చిత్రం) కంటే ముందే ‘మిత్ర మండలి’ కథ విన్నాను. కానీ ‘పెరుసు’ ముందు రిలీజ్ అయింది. ‘మిత్ర మండలి’లో ఉండే భారీ క్యాస్టింగ్ వల్ల అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి అక్టోబర్ 16న మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
→ ఈ చిత్రంలో నేను ఓ సాఫ్ట్ పాత్రను పోషించాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్ ఫ్లూయెన్సర్‌గా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది.
→ ప్రియదర్శి చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు. ‘మిత్ర మండలి’ షూటింగ్‌లో ఉండగానే ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రియదర్శి ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగి ఉంటారు.
→ నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలని చూస్తున్నాను. కామెడీ ప్రధాన చిత్రాలే అంటే నేను నా ఇన్ స్టాగ్రాంలో రీల్స్ చేసుకుంటాను కదా (నవ్వుతూ).
→ నేను పరాజయాలకు ఇట్టే కృంగిపోతాను.. ఫెయిల్యూర్స్ వస్తే చాలా బాధపడతాను. అయితే వెంటనే దాన్నుంచి బయటకు వచ్చేస్తాను.
→ తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. టాలీవుడ్‌లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు.